మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (12:33 IST)

తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన సైనికుడు!

express rail
పీకల వరకు తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై  ఓ సైనికుడు మూత్రవిసర్జన చేశాడు. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి దుర్గ్ వెళుతున్న గోండ్వాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. పైనున్న బెర్త్‌పై మూత్ర విసర్జన చేయడంతో కిందనున్న మహిళపై పడింది. ఈ ఘటనపై బాధితురాలు ఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన బాధిత మహిళ తన కుమారుడు, భర్తతో కలిసి బీ-9 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. పై బెర్తులో ఉన్న జవాను మూత్ర విసర్జన చేయడంతో అది మహిళపై పడింది. ఆ వెంటనే ఆమె తన భర్తకు చెబితే ఆయన 139 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు ఎక్కినప్పటికీ జవానుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
 
దీంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే, ఆర్పీఎఫ్ అధికారులు మాత్రం తాము స్పందించామని, బాధిత మహిళ తన సీట్లో కనిపించలేదని పేర్కొన్నారు. సైనికుడు మాత్రం పూర్తిగా తాగిన మత్తులో నిద్రపోతున్నాడని పేర్కొన్నారు.