శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (14:50 IST)

ఓటు హక్కు వినియోగంలో ప్రపంచ రికార్డు సృష్టించాం : మహిళా ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చిన ఈసీ

rajiv kumar
దేశంలో ఏడు వారాల పాటు సాగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రపంచ రికార్డును సాధించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఫలితాల కోసం దేశం యావత్ ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటుచేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 
 
తాజా ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు. 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.
 
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇదే. 1.5 కోట్ల మంది పోలింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. 68,763 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి. 135 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చాం. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4 లక్షల వాహనాలను ఉపయోగించాం. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గింది. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్‌ జరిగింది.
 
గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది. మొత్తం అక్కడ 58.58 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాశ్మీర్‌ లోయలో 51.05 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. రూ.10 వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్‌, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. 2019లో ఈ సంఖ్య రూ.3,500 కోట్లుగా ఉందని వివరించారు.