గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (20:29 IST)

టర్కీలో ఆగని వరుస భూకంపాలు - వేలాది మంది మృత్యువాత

turkey earthquake
టర్కీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం 7.8 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. తాజాగా 6.0 తీవ్రతతో మూడో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రాన్ని సెంట్రల్ టర్కీలో గుర్తించారు. 
 
ఆ తర్వాత 12 గంటల వ్యవధిలో మరో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ భూకంపం దాటికి ఇప్పటివరకు 1600మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. శిథిలాల కింద నుంచి ఇంకా వెలికితీత కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ఈ వరుస భూకంపాల నేపథ్యంలో టర్కీ, సిరియా దేశాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 
 
మరోవైపు, ఈ వరుస భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం చాచారు. మోడీ ప్రకటన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.