సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (13:10 IST)

తమిళనాడులో కుండపోత వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు

chennai rains
తమిళనాడు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో సోమవారం సాయంత్రం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. దీంతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలకు మాత్రం మంగళవారం సెలవు ప్రకటించారు. 
 
మరోవైపు, చెన్నైతో కాంచీపురం, తిరవళ్లూరు, చెంగల్పట్టు, మైలాడుదురై, కడలూరు జిల్లాల్లో బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. 
 
మరోవైపు, వచ్చే రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం మాత్రం అన్ని పాఠశాలలకు మాత్రం సెలవులు ప్రకటించారు. కాలేజీలకు మాత్రం యధావిధిగా పనిచేశాయి. ఇదిలావుంటే, ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడివుంది. 
 
దీనికితోడు ఈశాన్య రుతుపవనాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో  వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.