భారత్ - చైనాల మధ్య ఘర్షణ - తోకముడిచిన డ్రాగన్ సైన్యం
డ్రాగన్ దేశం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. తూర్పు లడఖ్‌లో మళ్లీ సైనికులను తరలిస్తూ చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది. దీంతో చైనా సైనికులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా ధీటుగా స్పందించింది. దీంతో చైనా సైనికులు తోకముడిచి అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు, అరుణాచల్ సెక్టార్‌లోనూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అరుణాచల్ సెక్టార్‌లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శాంతి మంత్రం జపిస్తూనే ఇప్పుడు తూర్పు లడఖ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ వద్ద కూడా చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం గమనార్హం.
భారత బలగాలు సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా 200 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపానికి రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్ఐసీని దాటేందుకు ప్రయత్నించగా భారత్ సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు వాస్తవాధీన రేక నుంచి వెనక్కి వెళ్లిపోయాయి.