రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కరోనా వైరస్ సోకిందా?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సోకుతుంది. ముఖ్యంగా, ఈ వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నా, కరచాలనం చేసినా ఈ వైరస్ అంటుకుంటుంది. అలా, రష్యా అధినేత వ్లాదిమిరి పుతిన్ కూడా ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే.. పుతిన్‌ను కలిసిన ఓ ఆస్పత్రి చీఫ్ వైద్యుడికి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. పైగా, ఈ వైద్యుడు పుతిన్‌తో కరచాలనం కూడా చేశారు. దీంతో పుతిన్‌కు ఈ వైరస్ సోకివుంటుందన్న ప్రచారం సాగుతోంది. ఇది రష్యాలో కలకలం రేపుతోంది.
కరోనా వైరస్ బాధిత దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఈ నేపథ్యంలో గత వారంలో వ్లాదిమిరి పుతిన్ ఓ ఆస్పత్రిని సందర్శించారు. అపుడు ఆ ఆస్పత్రి చీఫ్ డెనిస్ ఫ్రాట్రెంకోతో కరచాలనం చేశారు. పైగా, పుతిన ఆ ఆస్పత్రిలో ఉన్నంతసేపు.. ఆ వైద్యుడు కూడా వెంటవున్నారు. కరోనా బాధితుల కోసం ప్రత్యకంగా ఏర్పాటు చేసిన ఆ ఆస్పత్రిలో ఉన్న మౌలిక వనరులు, వసతులు, ఆస్పత్రి గురించి వివరించారు.
ఈ నేపథ్యంలో డెనిస్‌కు సుస్తి చేయడంతో ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించిన అధికారులు, ఆసుపత్రిని సందర్శించిన సమయంలో పుతిన్, వైరస్ బారి నుంచి రక్షించే హజ్మత్ సూట్‌ను ధరించి ఉన్నారని పేర్కొన్నారు. అధ్యక్షుడికి ఆరోగ్య పరీక్షలు జరిగాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.