మరో ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన 4 నిమిషాలకే సముద్రంలో మునక
మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి శనివారం బయలుదేరిన బోయింగ్ 737 విమానం కొద్దిసేపటికే విమానయాన అధికారులతో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో 62 మంది ప్రయాణిస్తున్నారు. శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్ 182 సముద్రంలో కూలిపోయిందని భయపడుతున్నట్లు ఎఎఫ్‌పి నివేదించింది.
టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల తర్వాత జెట్ ఏటవాలుగా మునిగిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. నగరానికి ఉత్తరాన ఉన్న నీటిలో అనుమానిత శిధిలాలను కనుగొన్నారని బసర్నాస్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు.
ఈ విమానం సోకర్నో-హట్టా విమానాశ్రయం నుండి బయలుదేరి, జకార్తా నుండి ఇండోనేషియా లోని బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంటన్ ప్రావిన్స్ రాజధాని పొంటియానాక్‌కు 90 నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సి వుంది. విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ రాడార్ 24 డేటా విమానం బోయింగ్ 737-500 సిరీస్ అని చూపించింది.