చేయని నేరానికి జైలుశిక్ష - రూ.11 కోట్ల పరిహారం
కడపున పుట్టిన నలుగురు పిల్లలను కడతేర్చిన నేరారోపణలపై 20 యేళ్ల జైలు జీవితం గడిపిన ఓ మహిళకు 2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.11 కోట్లు) పరిహారంగా ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేసులో ఆమె నిర్దోషి అని తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. న్యూసౌత్ వేల్స్‌కు చెందిన కాథ్లీన్ ఫోల్బిగ్ (58)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
1989 - 99 మధ్య కాలంలో ఆ నలుగురూ ఆకస్మికంగా మృతి చెందారు. కన్నతల్లే వారిని హత్య చేసినట్టు ఆరోపణలు చ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిల్లల పెంపకం, కష్టాలపై కాథ్లీన్ ఫోల్బింగ్ తన డైరీలో రాసుకున్న రాతలు, ఇతరత్రా సాక్ష్యాల ఆధారంగా 2003లో ఆమెకు 30 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అయితే, తాను ఏ తప్పూ చేయలేదంటూ ఆమె న్యాయ పోరాటం చేసింది. ఆమె పిల్లలు నలుగురూ సహజ కారణాలతోనే మరణించివుంటారని శాస్త్రీ ఆధారాలు తేల్చాయి. దీంతో 20 యేళ్ళ తర్వాత ఆ మహిల నిర్దోషిగా జైలు నుంచి విడుదలకాగా, ఆమెకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రూ.11 కోట్ల మేరకు పరిహారం చెల్లించింది.