సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (09:54 IST)

భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన అమెరికా... ఎయిర్ పోర్టు నుంచే వెనక్కి

భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. ఏకంగా 21 మంది విద్యార్థులను ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించింది. వివిధ యూనివర్శిటీల్లోని కోర్సుల్లో చేరేందుకు వెళ్లిన విద్యార్థులు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. ఈ ఘటన గురువారం అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో విమానాశ్రయాల్లో జరిగింది. దీంతో ఆ 21 మంది విద్యార్థులను ఎయిర్ పోర్టు నుంచి రిటర్న్ ఫ్లైట్ ఎక్కించి భారత్‌కు పంపించారు. 
 
వివిధ పత్రాలు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలను చూపారు. వారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. విమానాశ్రయాలకు చేరుకున్నాక సాధారణ తనిఖీల్లో భాగంగా కొంతమందిపై అనుమానంతో అక్కడి  ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆరా తీశారు. ప్రవేశాలు దక్కిన వర్సిటీలో ఫీజులు, విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. 
 
ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలు, అమెరికాలోని విద్యార్థులతో సంభాషణలను లోతుగా పరిశీలించిన అధికారులు వారిని తిప్పి పంపినట్లు తెలుస్తోంది. ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్ అయిన విద్యార్థులు తిరిగి ఐదేళ్ల వరకు ఆ దేశ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా మిగిలిపోతారన్న విషయం తెల్సిందే.