ఎల్వోసీ వద్ద ఉద్రిక్తత
భారత ఆర్మీ త్వరలో లఢాఖ్‌లో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో భారత సైనిక బలగాలు ప్యాన్‌గాంగ్ సో వద్ద పెట్రోలింగ్ నిర్వహించాయి. ఐతే భారత ఆర్మీ పెట్రోలింగ్ పట్ల చైనా సైన్యం అభ్యంతరం తెలిపింది.
గస్తీ నిర్వహించవద్దంటూ చైనా సైనికులు, భారత సైనికులను అడ్డుకున్నారు. ఇరు దేశాల సైనికుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. రెండు దేశాల జవాన్లు పరస్పరం తోసుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. జవాన్ల తోపులాట వార్తలతో ఇండో-చైనా బోర్డర్‌లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
దాంతో ఇరు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. చుసల్ ప్రాంతంలో బోర్డర్ పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ అధికారులు సమావేశమై చర్చించారు. దాంతో గొడవ సద్దుమణిగింది. లడాఖ్-టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సుపై భారత్-చైనా మధ్య గొడవలున్నాయి.
ఈ ప్రాంతం తమ దంటే తమదంటూ రెండు దేశాలు పట్టుబడుతున్నాయి. సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోవడం, వాస్తవాధీన రేఖను చైనా గుర్తించకపోవడంతో భారత్-చైనా సైన్యాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఎల్వోసీ రేఖ వద్ద టెన్షన్స్ సహజమే అని ఆర్మీ పేర్కొంది.
చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపింది. ఆర్టికల్370 రద్దుపై చైనా కుతకుతలాడిపోతోంది. లఢాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని డ్రాగన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే అక్సాయ్ చిన్‌ను ఆక్రమించిన చైనా, లఢాఖ్‌పై కూడా కన్నేసింది. ఇది గుర్తించిన మోదీ సర్కారు, చైనాకు షాకిస్తూ లఢాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది.
దాంతో చైనా ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచింది. భారత్-చైనా సైన్యం మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు.
గతంలో డోక్లాం విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అప్పుడు కూడా చైనా సైనికులు పేట్రేగిపోయారు. నియంత్రణ రేఖను దాటి డోక్లాంలోకి చొరబడడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని భారత సైన్యం సమర్దవంతంగా అడ్డుకుంది. దాంతో చైనా సైన్యం తోకముడిచింది.