జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్తత... ధోని భద్రతపై స్పందించిన ఆర్మీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ విషయంలో సంచనల నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 370, 35ఎ నిబంధనను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తమ అభిమాన ఆటగాడి భద్రత విషయంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ధోని భద్రతపై తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించాడు. ఆర్మీ దుస్తులను ధరించి విధుల్లో చేరినప్పుడే అతడు ఎలాంటి పరిస్థితులయినా ఎదుర్కోడానికి సిద్దపడ్డాడు. కాబట్టి తాజా పరిణామాల నేపథ్యంలో అతడిలో ఎలాంటి ఆందోళన లేదు. కాబట్టి అభిమానులు కూడా అతడిలాగే దైర్యంగా వుండాలని... ఎలాంటి ఆందోళన అవసరంలేదని రావత్ సూచించారు.
ధోనికి ప్రత్యేక సెక్యూరిటీ ఏమీ కల్పించడం లేదని తెలిపారు. అతడి సహచర సైనికాధికారులకు ఎలాంటి సదుపాయాలు కల్పించామో అతడికి అవే కల్పించాం. ఉన్నతాధికారులు తనకు కేటాయించిన విధులను ధోని సిన్సియర్ గా చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతడు తన విధులను సమర్థవంతంగా పూర్తి చేస్తాడని నమ్ముతున్నానని రావత్ పేర్కోన్నారు.
క్రికెట్ అంటే ఇష్టపడేవారంతా తనను అభిమానిస్తుంటే ధోని మాత్రం దేశ రక్షణ కోసం పాటుపడే ఆర్మీ జవాన్లను అభిమానిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి భారత ఆర్మీతో కలిసి పనిచేయాలన్న కుతూహలం పెరిగింది. ధోని ఉత్సాహాన్ని గమనించిన ఆర్మీ ఉన్నతాధికారులు అతడికి స్పోర్ట్స్ కోటాలో లెప్టినెంట్ కల్నల్ హోదాను కల్పించారు.
ఇలా బెంగళూరు హెడ్ క్వార్టర్ గా పనిచేసే పారాచూట్ రెజిమెంట్ లో చేరిన ధోని 2015 నుండి ఇప్పటివరకు ఐదుసార్లు పారాచూట్ జంపింగ్ లో పాల్గొన్నాడు. ఇలా ఆగ్రా ట్రెయినింగ్ క్యాంప్ లో ఆర్మీ విమానం పై నుండి దూకి ధోని అధికారికంగా పారాట్రూపర్ గా మారాడు.