శనివారం, 30 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:38 IST)

గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేస్తున్న యాప్‌..!

ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా 90 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. పాజిటివ్‌ వస్తుండటంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగింది.

కాస్త జ్వరం, నీరసం వచ్చినా కరోనా టెస్టుకు వెళుతున్నారు. టెస్టుకు వెళ్లి కరోనా బారినపడినవారూ ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ.. సరికొత్త యాప్‌ వచ్చేసింది.

అదే 'వోకలిస్‌ చెక్‌' (VocalisCheck). ఈ యాప్‌ విశేషమేమిటంటే.. కేవలం మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది. ఇంకెందుకాలస్యం ఆ వివరాలు మీ కోసం..
 
ఎలా పనిచేస్తుందంటే..
'వోకలిస్‌ చెక్‌ ఓపెన్‌ చేశాక.. అందులో 50 నుంచి 70 వరకు అంకెలను గట్టిగా లెక్కపెట్టాలి. మనం చెప్పిన ఆ ఆడియో రికార్డ్‌ అవుతుంది. ఈ ఆడియో స్పెక్టోగ్రామ్‌గా మారి, హీట్‌ ఇమేజ్‌లాగా కనిపిస్తుంది. అప్పుడీ హీట్‌ మ్యాప్‌.. కోవిడ్‌ పేషెంట్ల ఆడియోతో పోల్చి కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది.
 
పైసా ఖర్చు లేకుండా సులభంగా నిర్థారించుకోవచ్చు : వోకలిస్‌ హెల్త్‌ సంస్థ కో ఫౌండర్‌ షేడీ హసన్‌
కరోనా టెస్ట్‌ కోసం పైసా ఖర్చుచేయకుండా, అతి తక్కువ టైమ్‌లో ఈ యాప్‌తో కరోనా ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా సులభమని వోకలిస్‌ హెల్త్‌ సంస్థ కో ఫౌండర్‌ షేడీ హసన్‌ తెలిపారు.

ఎఐ అల్గారిథమ్స్‌ వాయిస్‌ నమూనా నుంచి 512 విభిన్న లక్షణాలను సేకరించడానికి యాప్‌ను రూపొందించారు. అయితే కోవిడ్‌ డిటెక్షన్‌ కోసం.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాల ఆధారంగా ఈ అల్గారిథం కరోనా పాజిటివ్‌ అవునా ? కాదా ? అనే విషయాన్ని చెబుతుంది.
 
కేవలం రెండు నిముషాల్లో..
ఇజ్రాయెల్‌కు చెందిన టెక్‌ కంపెనీ వోకలిస్‌ హెల్త్‌ ఈ యాప్‌ను డెవలప్‌ చేసింది. ఇప్పటికే ఉన్న నమూనాల డేటాబేస్‌కు మీ వాయిస్‌ లక్షణాలను సరిపోల్చడానికి కృత్రిమ‌ మేధస్సు (Artificial Intelligence)ను ఉపయోగిస్తుంది. కరోనా వల్ల ఎంత ప్రమాదంలో ఉన్నారో కేవలం రెండు నిమిషాల్లోనే చెప్పేస్తున్న ఈ యాప్‌ను.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబైతో కలిసి వోకలిస్‌ హెల్త్‌ కంపెనీ టెస్ట్‌ చేసింది.

2000 మంది పేషెంట్ల ఆడియోను హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, గుజరాతీ భాషల్లో రికార్డు చేసి పరీక్షించింది. ఇందులో 81.2 శాతం సక్సెస్‌ రేట్‌ రావడం విశేషం.
 
ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..
ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన వోకలిస్‌ యాప్‌ మాత్రం ఊహించిన విధంగా పనిచేయడం లేదని, లోడ్‌ అవుతున్న సమయంలో క్రాష్‌ అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. సులభతరమైన యాప్‌ ఉన్నప్పటికీ కరోనా లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులతో కరోనా పరీక్షలను నిర్వహించుకొని నిర్థారించుకోవడం ఉత్తమం.