మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (14:36 IST)

స్నేహితుల హేళన ... ఒంటరితనంతో విసిగిపోయిన క్రూక్స్.. విరక్తితోనే ట్రంప్‌ హత్యకు కుట్ర!!

Thomas Matthew Crooks
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌ను అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులు కాల్చి చంపేశారు. ఈ కేసును హత్యాయత్నంగా పరిగణించిన పోలీసులు.. ఆ దిశగా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా, నిందితుడు క్రూక్స్ పుట్టుపూర్వోత్తలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, కాల్పులకు తెగబడేందుకు క్రూకను పురిగొల్పిన పరిస్థితులు, అతడి నేపథ్యం గురించి తెలుసుకునేందుకు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
 
స్కూల్లో థామస్ క్రూక్స్‌తో కలిసి చదువుకున్న పలువురు అతడి గురించి కీలక విషయాలు వెల్లడించారు. అతడు దుస్తులు ధరించే తీరు కారణంగా తోటి విద్యార్థులు నిత్యం గేలి చేస్తూ ఉండేవారని తెలిపారు. క్రూక్స్ ఒంటరితనంతో బాధపడుతున్నట్టు కనిపించేవాడని అన్నారు. అయితే, క్రూక్స్ అప్పుడప్పుడూ వర్తమాన రాజకీయాలు, డోనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడేవాడని తెలిపారు.
 
క్రూక్స్ కారులో ఓ అనుమానాస్పద వస్తువును కూడా పోలీసులు గుర్తించారు. దీన్ని ప్రస్తుతం బాంబ్ టెక్నీషియన్లు పరీక్షిస్తున్నారు. పేలుడు పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అతడి ఫోనులోని సమాచారం ఆధారంగా హత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, నిందితుడు ఉపయోగించిన గన్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్ అని తెలిపారు. అతడి తండ్రి పేరిట ఈ ఆయుధం రిజిస్టరయి ఉందని, దాన్ని చట్టబద్ధంగానే కొనుగోలు చేసినట్టు గుర్తించామని ఎఫ్.బి.ఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
 
ఇక క్రూక్స్ మానసిక రుగ్మతలు ఉన్నట్టు ఇప్పటివరకూ ఏ ఆధారాలు దొరకలేదని కూడా అధికారులు తెలిపారు. అతడికి మిలిటరీ వ్యక్తులతో కూడా ఎటువంటి సంబంధాలు లేవని తెలిపారు. ఒంటరిగానే ఈ హత్యయత్నానికి క్రూక్స్ పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. క్రూక్స్ రాజకీయ నేపథ్యంపై కూడా అస్పష్టత నెలకొంది. ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ గతంలో డెమోక్రటిక్ పార్టీకి కూడా విరాళమిచ్చినట్టు అధికారులు గుర్తించారు. అతడి డిస్కోర్డ్ సోషల్ మీడియాలో అకౌంట్‌లో రాజకీయపరమైన అంశాలు చర్చించిన ఆధారాలు కూడా దొరకలేదు.