అంతకంతకూ పెరిగిపోతున్న ప్రధాని మోడీ పాపులారిటీ!!
సోషల్ మీడియాలోనే కాకుండా, పలు దేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినప్పటికీ మోడీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. తాజాగా ఆయన ఎక్స్‌లో రికార్డు సృష్టించారు. తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించారు. దీంతో ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
'నా ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది. ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు... ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
ఇక, భారత్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' ఫాలోవర్ల సంఖ్య 26.4 మిలియన్లు కాగా... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు 27.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇండియా కూటమిలోని నేతలందరి ఎక్స్ ఫాలోవర్లను కలిపితే 9.5 కోట్లు కాగా... ప్రధాని మోడీ ఒక్కరే 10 కోట్లతో టాప్‌లో నిలవడం విశేషం. అలాగే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కూడా ఆయన అధికమించారు.