సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (15:31 IST)

టిక్ టాక్ యువతిపై మగాళ్ళ రాక్షసత్వం.. బట్టలు చింపి.. గాల్లో ఎగురవేసి...

పాకిస్థాన్ దేశంలో ఇటీవలి కాలంలో ఆటవిక చర్యలు అధికమైపోతున్నాయి. తాజాగా టిక్ టాక్ వీడియోలు చేసే ఓ యువతిపై మగాళ్లు తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 400 మంది మగాళ్లు ఈ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి ఆ మృగాళ్ల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ యువతి వస్త్రాలను చింపేసిన కొందరు కిరాతకులు.. వాటిని గాల్లోకి ఎగురవేసి పైశాచికానందం పొందారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగస్టు 14వ తేదీన పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం. లాహోర్‌లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్‌లో తన ఐదుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తున్న టిక్ టాకర్‌ యువతిని ఆ అల్లరి మూక హింసించింది.
 
గుమిగూడి ఆ అమ్మాయిపై 400 మంది అకృత్యాలకు పాల్పడ్డారు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించేశారు. గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. నడి బజారులో ఆ అమ్మాయిని బట్టల్లేకుండా నడిపించారు. అంతేకాదు.. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచేశారు. సెల్ ఫోన్‌ను లాక్కున్నారు. డబ్బులను దొంగిలించారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌ అయింది. 
 
ఈ ఘటనపై బాధిత యువతి నిన్న లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మినారీ పాకిస్థాన్ వద్ద తన ఆరుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తుండగా.. 400 మంది తనను లైంగికంగా, శారీరకంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఆ అల్లరి మూకల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదని ఆవేదన చెందింది. కొందరు తనను కాపాడే ప్రయత్నం చేసినా.. గుంపు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని వాపోయింది. తనను గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించేసి వికృతానందం పొందారని ఆవేదన వ్యక్తం చేసింది.