chiranjeevi birthday విశ్వంభరునికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు
తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవికి జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవంగా పేర్కొన్నట్ట తెలిపారు.
ఆయన వెల కట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను.
అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన 'విశ్వంభరుడు'.. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.