గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (09:35 IST)

సానియా మీర్జా దంపతులకు యూఏఈ 'గోల్డెన్ వీసా'

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ఈ దంపతులకు 10 ఏళ్ల గోల్డెన్ వీసాతో సత్కరించింది.

దేశంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులకు 2019 నుంచి యూఏఈ 5ఏళ్లు, 10 ఏళ్ల లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాలను(గోల్డెన్ వీసా) మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా సానియా దంపతులకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది.
 
హైదరాబాద్‌కు చెందిన సానియా, పాకిస్తాన్‌లోని సియల్‌కోట్‌కు చెందిన షోయబ్ మాలిక్ 2010లో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. తాజాగా గోల్డెన్ వీసా అందుకోవడం పట్ల సానియా దంపతులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఇప్పటివరకు క్రీడావిభాగంలో గోల్డెన్ వీసా పొందిన వారిలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో, లూయిస్ ఫిగో, టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ ఉన్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సంజయ్ దత్ గోల్డెన్ వీసా అందుకున్నారు.