సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (12:03 IST)

యూపీలో పర్వేష్ ముషారఫ్ సంబంధీకుల ఆస్తి!! రూ.1.38 కోట్లకు వేలం

musharraf
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ సంబంధీకుల ఆస్తి ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆస్తిని రూ.1.38 కోట్లకు వేలం వేశారు. ఈ నెల 5వ తేదీన ఈ వేలం పాటలు నిర్వహించారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగత్‌లోని బరౌత్ తహసీల్లో కొటానా గ్రామంలో ఉన్న రెండు హెక్టార్ల భూమిని ఇలా అధికారులు వేలం వేశారు.
 
అయితే, ఈ ఆస్తిని 2010లో భారత్ 'శత్రువు ఆస్తి'గా ప్రకటించింది. అంటే.. ఇండియాలోని పాకిస్థానీ పౌరుల యాజమాన్యంలోని ఆస్తులకు సంబంధించినవని అర్థం. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ విభాగం అధీనంలో ఉంటాయి.
 
కాగా, బరౌత్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అమర్ వర్మ ముషారఫ్ తాత కొటానాలో నివసించినట్లు ధ్రువీకరించారు. "పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తండ్రి సయ్యద్ ముషారఫుద్దీన్, తల్లి జరీన్ బేగం ఎప్పుడూ ఈ గ్రామంలో నివసించలేదు. కానీ అతని మామ హుమయూన్ చాలా కాలం పాటు ఇక్కడ నివసించారు" అని వర్మ పీటీఐతో చెప్పారు.
 
అలాగే స్వాతంత్ర్యం రాకముందు హుమాయున్ నివసించిన ఇల్లు కూడా ఈ గ్రామంలోనే ఉందన్నారు. 2010లో శత్రు ఆస్తిగా ప్రకటించి ఈ భూమిని గురువారం రాత్రి 10.30 గంటలకు వేలం ఖరారు చేశారు. మొదట వేలం రూ.39.06 లక్షలతో ప్రారంభం కాగా, చివరికి రూ.1.38 కోట్ల వరకు పలికింది. ఇక విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విభాగం ఖాతాలో జమ చేస్తామని భాగత్ పరిపాలన సీనియర్ అధికారి తెలిపారు.
 
'భూమి మా రెవెన్యూ రికార్డులలో 'నూరు' పేరుతో నమోదైంది. ఈ నూరు, పర్వేజ్ ముషారఫ్ మధ్య ఎటువంటి పత్రబద్ధమైన సంబంధం లేదు. నూరు 1965లో పాకిస్థాన్‌కు వెళ్లిన నివాసి అని మాత్రమే రికార్డులు చూపిస్తున్నాయి' అని భాగత్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) పంకజ్ వర్మ పీటీఐకి చెప్పారు.
 
అయితే, ఆ భూమిని కేంద్ర ప్రభుత్వం శత్రు ఆస్తులుగా ప్రకటించిందని, నిబంధనల ప్రకారమే వేలం వేసిందని ఆయన తెలిపారు. ఇక కొటానా గ్రామంలోని బరౌత్ తహసీల్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ఎలాంటి నివాస ప్రాంతంగా గుర్తించబడలేదని ఏడీఎం పేర్కొన్నారు.