మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (12:09 IST)

వాషింగ్టన్‌లో రణరంగం : ట్రంప్‌ అభిశంసనపై మంత్రివర్గం మంతనాలు!

అమెరికా, వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంపై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ చర్యను అమెరికా మంత్రివర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి దుశ్చర్యలకు ఉసిగొల్పినందుకు డోనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించే యోచనలో ఆయన క్యాబినెట్ సహచరులు ఉన్నట్టు సమాచారం. 
 
అమెరికా దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా క్యాపిటల్ బిల్డింగ్‌లో జరిగిన ఘటనలను అత్యంత తీవ్రంగా, జాతి విద్రోహంగా పరిగణిస్తున్న మంత్రులు, ఆయన్ను తక్షణం తొలగించేలా పావులు కదుపుతున్నట్టు మూడు యూఎస్ న్యూస్ చానెల్స్ బ్రేకింగ్ న్యూస్ వేశాయి.
 
అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను వినియోగించుకోవాలని మంత్రులు భావిస్తున్నారు. ఈ అధికరణ ప్రకారం, అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులు కలసి తొలగించవచ్చు. 
 
అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అత్యధికులు నమ్మాల్సి వుంటుంది. కాగా, ఈ ప్రక్రియ అంత సులువు కానప్పటికీ, అదే జరుగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
ఇక ట్రంప్‌కు సహచరుడిగా ముద్రపడ్డ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పెన్స్, ఇతర క్యాబినెట్ మంత్రులతో సమావేశం జరిపి, ట్రంప్ అభిశంసనకు తీర్మానం చేస్తారా? అన్న విషయమై అనుమానాలు నెలకొన్నాయి. ట్రంప్ తొలగింపు విషయాన్ని రిపబ్లికన్ నేతలే స్వయంగా చెప్పారని సీఎన్ఎన్, సీబీఎస్ వంటి వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలను ఇచ్చాయి. 
 
గత యేడాది నవంబరు నెలలో జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఆయన తన ఓటమిని అంగీకరించడం లేదన్న సంగతి తెలిసిందే. ఇక, నూతన అధ్యక్షుడిగా బైడెన్, మరో రెండు వారాల్లో బాధ్యతలు చేపట్టాల్సి వుంది. ఈ సమయంలో ఆయన్ను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ సమావేశమైన వేళ, ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగారు. పోలీసులు ఎదురుకాల్పులు జరుపగా, కనీసం నలుగురు మరణించినట్టు తెలుస్తోంది.