శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (12:39 IST)

ఒకవైపు కయ్యం.. మరోవైపు సాయం ఆఫర్... చైనా వైఖరిపై భారత్ విస్మయం!

డ్రాగన్ కంట్రీ నిత్యం సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతోంది. మరోవైపు, శాంతిమంత్రాన్ని జపిస్తోంది. తాజాగా కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా అధినేత జీ జిన్‌పింగ్ వెల్లడించారు. తమ దేశంలో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తోందని, దీన్ని భారత్‌తో పాటు.. సౌతాఫ్రికా దేశాలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
అయితే, చైనా ఇలా అడగకుండానే ముందుకు రావడానికి బలమైన కారణమే ఉంది. వ్యాక్సిన్ తయారీ భారీ ఎత్తున తయారు చేయాలంటే, భారత్‌తో ఒప్పందం తప్పనిసరని భావిస్తున్న చైనా, ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా భారత సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. 
 
తాజాగా, వ్యాక్సిన్‌ను పంచుకునే విషయమై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్, కరోనా విషయమై సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకునేందుకు ఇండియా, చైనాలు చర్చలు జరుపుతాయనే భావిస్తున్నట్టు తెలిపారు. 
 
అభివృద్ధి చెందుతున్న దేశాలకు చౌక ధరకు అందించేందుకు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో చైనా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని, కరోనాపై పోరాటంలో వివిధ దేశాలకు తాము సహకరిస్తామని అన్నారు. 
 
కాగా, 12వ బ్రిక్స్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన జిన్ పింగ్, చైనా కంపెనీలు రష్యా, బ్రెజిల్ భాగస్వామ్య సంస్థలతో వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై చర్చిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ విషయంలో ఇండియా, సౌతాఫ్రికాలు తమకు కీలక భాగస్వాములని కూడా అన్నారు. 
 
ఈ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో, సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాలు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.