గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (12:45 IST)

నెల రోజుల్లో రెండుసార్లు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది?

సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రసవించి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందో మహిళ. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. బంగ్లాదేశ్‌లోని జెస్సోరీ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీకి ఫిబ్రవరి 25న నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా సాధారణ ప్రసవంలో నెలలు నిండని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉండటంతో వైద్యులు వారిని ఇంటికి పంపించారు. అయితే మరలా మార్చి 22న అరిఫాకు మరోసారి నొప్పులు రావడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలో మరో ఇద్దరు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి పిల్లలను బయటకు తీసారు.
 
అంటే సరిగ్గా 26 రోజుల తర్వాత అరిఫా మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. అరిఫాకు రెండు గర్భాశయాలు ఉన్నట్లు, తొలి కాన్పు సమయంలో ఈ విషయాన్ని వైద్యులు గుర్తించకపోవడం వల్ల ఆమెకు నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రసవం అయ్యినట్లు వైద్యులు తెలిపారు. 
 
మహిళకు రెండు గర్భాశయాలు ఉండటం అత్యంత అరుదైన విషయమని, అలాంటిది అరిఫా మొదటి గర్భాశయం ద్వారా మగబిడ్డ జన్మనివ్వగా, రెండోసారి మరో గర్భాశయం ద్వారా కవలలు పుట్టారని చెప్పారు. బహుశా ఇలా జరగడం ఇదే తొలిసారి అయి ఉంటుందని అరిఫాకు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు షీలా తెలిపారు. అయితే ప్రస్తుతం అరిఫా, ఆమె ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.