శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 22 డిశెంబరు 2015 (21:23 IST)

విజయం కోసమే హీరోలంతా పోటీ : ఆది

హీరోలంతా ఒక్క కమర్షియల్‌ హిట్‌ కోసమే ఎదురుచూస్తుంటారు. కథలు చాలా వున్నాయి. రచయితలు, దర్శకులు చాలామంది వున్నారు. వారంతా హిట్‌ అవ్వాలనే కోరుకుంటారు. కానీ వందల కథల్లో ఏడాదికి 7,8 చిత్రాల్లో బ్లాక్‌బస్టర్లు అవుతాయి. వందల కథలకు పదుల సంఖ్యలో వున్న హీరోలు పోటీపడుతుంటారని'' సాయికుమార్‌ తనయుడు హీరో ఆది అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'గరం'. ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. రేపు... అనగా బుధవారం ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్‌..
 
ఈ పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నారు?
మా అమ్మాయితో గడుపుతాను.. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్‌ అయిన హీరోలతో చిన్నపార్టీ ఇస్తాను. పుట్టినరోజు నిర్ణయాలు అంటూ పెద్దగా లేవు.
 
'గరం' అంటే ఏమిటి?
వాడెప్పుడు గరం.. గరంగా వుంటారంటారు.. కథ ప్రకారం దర్శకుడు మదన్‌ అలా టైటిల్‌ పెట్టారు.
 
మీ పాత్ర ఎలా వుంటుంది?
ముక్కుసూటిగా వెళ్ళేపాత్ర నాది. తండ్రికీ.. నాకు మధ్య జరిగే సంఘర్సణతో విలేజ్‌ నుంచి సిటీ వస్తాను. అక్కడ జరిగే సంఘటనలే సినిమా. 
 
చిత్రం చాలా ఆలస్యమైంది. కారణం?
పలు కారణాలున్నాయి. ముఖ్యంగా రాజ్‌కుమార్‌ ప్రొడక్షన్‌లో మొదట రూపొందింది. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యాక.. కొన్ని కారణాలవల్ల ఆయన చిత్రాన్ని ఆపేశారు. కథ బాగా నచ్చడంతో నాన్నగారే ఈ చిత్రాన్ని స్వంత బేనర్‌ అయిన శ్రీనివాస సాయి స్క్రీన్స్‌పై కొనసాగించారు. దానికితోడు నటీనటులు చాలామంది వున్నారు. వారి డేట్స్‌ కూడా ఆలస్యమయింది. బ్రహ్మానందం నెలకు మూడు రోజులే డేట్స్‌ ఇచ్చారు. ఆరకంగా అందరి ఆర్టిస్టుల ప్లాన్‌ చేసుకోవడం..ఇలా పలు కారణాలున్నాయి.
 
అంతగా స్వంత బేనర్‌లో చేయడానికి కారణం?
కథ బాగా నచ్చింది. నాన్నగారు ఇలాంటి కథను వదలడం ఇష్టంలేదు. దర్శకుడు మదన్‌ కూడా ఇలాంటి సినిమా వదులుకుంటే.. మంచి కెరీర్‌ను మిస్‌ అవుతామని చెప్పారు. అందరికీ ఇది ప్రెస్టీజియస్‌ సినిమాగా మారింది.
 
మదన్‌ అంటే క్లాస్‌ దర్శకుడు.. మరి ఈ సినిమా ఎలా డీల్‌ చేశాడు?
మదన్‌ క్లాస్‌ దర్శకుడయినా కమర్షియల్‌ అంశాలతో చిత్రాలు తీశారు. సినిమాలో కావాల్సిన అంశాలన్ని వుంటాయి. కథనం ఆసక్తిగా వుంటుంది.
 
గోదావరి జిల్లాలో చిత్రీకరణ ఎలా అనిపించింది?
మా మామగారు, భార్య కూడా అక్కడివారు కావడంతో.. నాన్నగారిది కూడా అదే ఊరు. చిత్రీకరణలో చాలా సంతోషంగా వుంది. కథ రీత్యా అక్కడ యాసను ఫాలో అయ్యాను. ఆ యాసలో కాస్త వెటకారం వుంటుంది. సినిమాల్లో అది చాలా బాగుంటుంది.
 
ఈ పాత్ర కోసం ఎలాంటి హోంవర్క్‌ చేశారు?
ఈ పాత్ర చాలా ఈజ్‌తో కూడింది. అందుకే మదన్‌గారు ప్రోద్బలంతో రామ్‌, రవితేజ చిత్రాలు చూసి.. వాటిని ఫాలో అయ్యాను.
 
చుట్టాలబ్బాయి ఎంతవరకు వచ్చింది?
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో 'చుట్టాలబ్బాయ్‌' చేస్తున్నాను. ఇప్పటికి యాభై శాతం పూర్తయింది. వరుసగా సినిమాలు వస్తున్నాయి. కానీ ఒక్క కమర్షియల్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాను.
 
నాన్నగారితో కలిసి చేసే ఆలోచన వుందా?
మా బేనర్‌లో నాన్నగారు, నేను కలిసి చిత్రం చేసే ఆలోచనవుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాను అని తెలిపారు.