గురువారం, 22 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (21:51 IST)

నేను 21 ఏళ్ల కుర్రాడిగానే ఉహించుకుంటా... 'సోగ్గాడే చిన్నినాయన' నాగ్ ఇంటర్వ్యూ

కథలో తాతా మనవడు అనే పాత్రలతో కథ చెప్పారు, కాని అలా చేయాలంటే చాలా రకాల సమస్యలు ఉంటాయని తండ్రి కొడుకులుగా మార్చాం అని అంటున్నాడు ప్రముఖ నటుడు నాగార్జున. ఆయన ద్విపాత్రాభినయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. కొత్త దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం నాడు విడుదలవుతున్న సందర్భంగా నాగార్జునతో ఇంటర్వ్యూ .. 
 
'మనం' తరువాత చాలా గ్యాప్‌ తీసుకున్నారు కారణం? 
'మనం' సినిమా విడుదల తరువాత ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేశాను. దాంతోపాటు నాన్నగారు పోవడంతో కొంత గ్యాప్‌ వచ్చింది. అయితే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో షూటింగ్‌ ఒకేసారి రెండు సీజన్స్‌ షూట్‌ చేయడంతో టైం ఎక్కువ పట్టేసింది. ఆ సమయంలో నేను 'ఊపిరి' సినిమా ఓకే చేసాను. ఆ సినిమా అప్పుడే స్టార్ట్‌ అవ్వాలి కాని కుదరలేదు. అందులో శృతి హసన్‌ హీరోయిన్‌గా అనుకున్నారు కాని ఆమె డేట్స్‌ సెట్‌ అవ్వలేక పోయాయి. ఆ తరువాత 'సోగ్గాడే చిన్ని నాయన' షూటింగ్‌ మొదలు పెట్టాము. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని అనుకున్నాం కాని మధ్యలోకి అఖిల్‌ సినిమా రావడంతో ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 
 
రెండు పాత్రలు ఎలా ఉంటాయి ? 
రెండు పాత్రలు ముందు అనుకోలేదు. నిర్మాత రామ్మోహన్‌ కథ చెప్పినప్పుడు ఈ పాత్రల్లో తాతా మనవడిగా ఉంటారని చెప్పారు. అయితే రెండు పాత్రల్లో వేరియేషన్స్‌ చూపించాలి. దానికి వయస్సు సమస్య వస్తుంది. అలాగే చాలా విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి. దీన్ని తండ్రీకొడుకులుగా మార్చాము. దాంతోపాటు ఈ సినిమా విలేజ్‌ బ్యాక్డ్రాప్‌లో కూడా కాదు. కాని విలేజ్‌ అయితేనే బెటర్‌ అని మొత్తానికి చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. 
 
రెండూ మీరే చేయడానికి కారణం ? 
సినిమా చుస్తే మీకే తెలుస్తుంది. 'హలో బ్రదర్‌' సినిమాలో రెండు పాత్రలలో నేనే కనపడాలి.. కాకుంటే ఆ సినిమా వేరేగా ఉండేది. ఇందులో బంగార్రాజు అనే తండ్రి పాత్రతో పాటు రాము అనే కొడుకు పాత్రలో కనిపిస్తా. తండ్రి పాత్ర సోగ్గాడిలా ఉంటుంది. అమ్మాయి కనిపిస్తే చాలు మాట్లాడే దాకా ఆగడు. అతనికి రొమాన్స్‌ కూడా బాగా ఎక్కువ. అందుకే ఈ టైటిల్‌ బాగుంటుందని పెట్టాం. ఇక రాము పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. తనకు లోకజ్ఞానం ఏమాత్రం తెలియదు. ప్రతిదానికి గూగుల్‌ మీద ఆధారపడతాడు. చాలా సరదాగా ఉంటుంది. అతడికి మెడిసిన్‌కు సంబంధించిన వాటికి తప్ప వేరే ఏ విషయాలు తెలియదు. 
 
కొత్త దర్శకుడి పనితనం ఎలా ఉంది? 
దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మంచి రైటర్‌. మనిషిలోని ఎమోషన్స్‌ను బాగా చెప్తాడు. అలాగే నాకు ఎప్పుడూ కొత్తవాళ్ళతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది. అలా వారితో చేసినప్పుడు కొత్తకొత్త ఆలోచనలు వస్తాయి. అలగే నా సినిమాకు పనిచేసే యూనిట్‌ మొత్తం టీంవర్క్‌గా పనిచేయాలన్నది నా ఆలోచన. ఈ రోజు ఏమి షూట్‌ చేస్తారో యూనిట్‌లో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. 
 
చాలాకాలం తరువాత రమ్యకృష్ణతో నటించారు?
చాలా సరదాగా ఉంది. తను అలాగే ఉంది. ఏమాత్రం మారలేదు. మేమిద్దరం కలిసి చేస్తుంటే హలో బ్రదర్‌ సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా మొత్తం రొమాంటిక్‌గా ఉంటుంది కూడా. 
 
చిన్న వయసు హీరోయిన్స్‌తో పనిచేయడం ఎలా అనిపిస్తుంది?
నాకన్నా చిన్న హీరోయిన్‌ అనేది నేను చూడను. మనం రియల్‌గా ఏదైనా చేస్తే మన మనసులో వేరే ఫీలింగ్‌ వస్తుంది కాబట్టి. నేను చేసేది నటన. పైగా నేనెప్పుడు నన్ను నేను 21 ఏళ్ల కుర్రడిగానే ఉహించుకుంటా.. 
 
సంక్రాంతికి గట్టి పోటి ఉంది, మరి ఈ సినిమాను ఇప్పుడే విడుదల చేస్తున్నారు ?
సంక్రాంతి అనేది సినిమాలకు పెద్ద పండగ. ఈ పండగకి ఎప్పుడూ పోటీ ఉంటుంది. మన సినిమాపై మంచి నమ్మకం ఉన్నప్పుడు ఎప్పుడైనా విడుదల చేయొచ్చు. అయితే ఇప్పుడు విడుదల విషయం చాలా కీలకం. ప్రతి సంక్రాంతికి పెద్ద సినిమాలు రెండుమూడు ఉండటం సహజం. ఈ ఆచారం ఇప్పుడు వస్తున్నది కాదు ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ల కాలం నుండే వచ్చింది. 
 
'ఊపిరి' ఎంతవరకు వచ్చింది ?
సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫిబ్రవరి కల్లా మొత్తం ఫినిష్‌ అవుతుంది. తమిళంలో కూడా చేస్తున్నారు కాబట్టి విడుదల ఎప్పుడనేది కరెక్ట్‌గా తెలియదు. 
 
'అఖిల్‌' సినిమా ఫలితం ఎలా ఉంది? 
నిజంగా భారీగా అఖిల్‌ని లాంచ్‌ చేసిన ఈ సినిమా పెద్ద షాకిచ్చింది. ఇది ఎవరు ఉహించని పరిణామం. దర్శకుడు వినాయక్‌, నిర్మాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కాని అది ఎందుకో ప్రేక్షకులకు నచ్చలేదు.  
 
తదుపరి సినిమాలు?
ఇప్పటికే రాఘవేంద్రరావు వెంకటేశ్వర స్వామిపై ఓ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది ఆ లైన్‌. ప్రస్తుతం ఈ సినిమా , ఊపిరి పూర్తిచేసుకుని ఆ కథపై కూర్చుంటాం అని ముగించారు.