తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన నిర్మాత సి. కళ్యాణ్. ప్రొడక్షన్ మేనేజర్ స్థాయి నుంచి డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా, స్ట్రెయిట్ చిత్రాల నిర్మాతగా మారిన ఆయన గతంలో మహేష్ బాబుతో 'ఖలేజా' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత దక్షిణ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షునిగా వుండి నూరు సంవత్సరాల సినిమా పండుగను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రస్తుతం పదవీకాలం పూర్తయి, పూర్తిగా హైదరాబాద్‌లో సినిమాల నిర్మాణం వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇటీవలే హన్సిక తమిళంలో నటించిన చిత్రాన్ని 'చంద్రకళ' పేరుతో విడుదల చేసి విజయాన్ని సాధించారు. అదే స్పూర్తితో 'పిశాచి' అనే చిత్రాన్నికూడా డబ్బింగ్ చేస్తున్నారు. 300 కేంద్రాల్లో (ఏపీ, తెలంగాణలో) ఈ నెల 27న రిలీజవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా సి.కళ్యాణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...
చంద్రకళ ఏ మేరకు పేరు తెచ్చింది?
'చంద్రకళ' ఓ పెద్ద సినిమా అంత బాగా లాభాలొచ్చాయి. మా టీవీలో ఇటీవలే ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తే... 14 టీఆర్‌పీ వచ్చింది. ఇది చాలా హైలైట్ అని ఆ ఛానల్ వారే చెబుతున్నారు.
విద్యార్థుల పరీక్షల సమయంలో 'పిశాచి' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు?
విద్యార్థులకు పరీక్షల సీజన్ ఇది. అలా పరీక్షల బిజీ నుంచి కాస్త బైటికి వచ్చి వినోదం కోరుకునే పిల్లలకు 'పిశాచి' మంచి వినోదాన్నిస్తుంది. పిల్లా పాప అనే తేడా లేకుండా కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఇప్పుడు మినహాయిస్తే తర్వాత పెద్ద చిత్రాలు వచ్చేస్తాయి.
సక్సెస్ కోసం దెయ్యాల్ని నమ్ముకున్నారే?
మనిషిలో భయం ఓ వీక్‌నెస్. దాన్ని భయపడుతూనే చూస్తుంటాం. దాన్ని క్యాష్ చేసుకోవడం అనే కంటే.. ఎంటర్‌టైన్ చేయడం అని చెబుతాను. ఈ సినిమా తమిళ్‌లో 'పిశాసు' పేరుతో రిలీజైంది. మిస్కిన్ దర్శకుడిగా బాలా నిర్మించిన చిత్రమిది. ఇద్దరు దిగ్గజాలు తెరకెక్కించిన సినిమా ఇది. తమిళంలో ఇప్పటికే ఘనవిజయం సాధించింది. వాస్తవానికి అమీర్‌ఖాన్ నటించిన 'పీకే' చిత్రంతో పోటీపడింది ఈ సినిమా. పీకే రిలీజ్ రోజు మల్టీప్లెక్సుల్లో ఒక్క షో మాత్రమే వేశారు. తొలిరోజు ఫలితం చూసి రెండు, మూడు, నాలుగు రోజుల్లో నాలుగు ఆటలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని మల్టీప్లెక్సుల్లో 6 వారాలు నాలుగు షోలు విజయవంతంగా ప్రదర్శితమైంది.
నటీనటులు ఎలా చేశారు?
ఈ చిత్రంలో కథానాయిక నటన అసమానం. పిశాచిగా, మామూలు అమ్మాయిగా అద్భుతంగా అభినయించింది. అసలు మంచి చేసే పిశాచం ఎలా ఉంటుందో తెరపై చూడాల్సిందే. దర్శకుడు మిస్కిన్ అంత అద్భుతంగా ఆ పాత్రని తీర్చిదిద్దాడు. కొన్ని సన్నివేశాల్ని గ్రాఫిక్స్‌లో తీయాలి. కానీ ఆ అమ్మాయి చాలా సహజంగానే చేసి చూపించింది. ప్రతి పాత్రా ఆసక్తికరం. కథానాయకుడు ఒక సంగీత దర్శకుడు.
అతడిని చూడగానే ఇలా ఉన్నాడేంటి? అనిపిస్తుంది. స్వతహాగానే రచయితలు, సంగీత దర్శకులు పిచ్చోడి మాదిరిగానే కనిపిస్తారు. వారి ధ్యాసంతా పనిమీదే వేరే లోకంలో ఉంటుంది. ఆ పాత్రనే హీరోలో చూపించాం. చంద్రకళ తర్వాత ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. కల్పన వల్లే ఇది సాధ్యమైంది. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది. రవిరావ్ ఫోటోగ్రఫీ, హరి సంగీతం హైలైట్స్. ఎక్కడా అనువాదపు వాసన ఉండదు.
డబ్బింగ్ సినిమాలు వద్దని గతంలో చాలామంది నిర్మాతలు ధర్నాలు చేశారు. వారికి మీరు సపోర్ట్ కూడా వున్నారు. మరి మీరే ఇలా చేయడానికి కారణం?
అప్పటి పరిస్థితులను బట్టి డబ్బింగ్ సినిమాలు చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకు సంఘీభావం తెలిపాం. ప్రేక్షకులు చాలా తెలివి మీరిపోయారు. ఎంత పెద్ద హీరో చిత్రమైనా వారి అంచనాలకు లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. అది స్ట్రెయిట్ సినిమా అయినా, డబ్బింగ్ సినిమా అయినా ఒక్కటే.
నిర్మాణం కొంతకాలం గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు వరుసగా చేస్తున్నారు. కారణం?
కొన్ని బాధ్యతల వల్ల నిర్మాణం చేయలేదు. అయినా నా సోదరుడు శ్రీనివాస్ ఆ పనిలో వున్నాడు. ఇప్పటికి కెరీర్‌లో 53 సినిమాలు నిర్మించా. నాయుడు గారిలా 100 సినిమాలు చేయాలన్నదే లక్ష్యం.
కొత్త చిత్రాల వివరాలు?
ప్రస్తుతం నయనతార ద్విపాత్రాభినయంతో 'మయూరి' చిత్రం ఆన్ సెట్స్ ఉంది. అలాగే ఏప్రిల్‌లో వరుణ్ తేజ్, పూరి కాంబినేషన్ సినిమా ఉంటుంది. అంతకంటే ముందే మార్చి తొలివారంలో 'జ్యోతిలక్ష్మి' ప్రారంభమవుతుంది. ఇదో చక్కని మాస్ సినిమా. ఈ చిత్రంలో ప్రశ్నించే విషయాలెన్నో ఉంటాయి. సినీ పరిశ్రమలో మహిళ అంటే చిన్నచూపు. దీనిపై ప్రశ్నలు ఉంటాయి. జ్యోతిలక్ష్మి చిత్రం హాట్ టాపిక్‌గా వుంటుందని భావిస్తున్నా. ఇప్పటి తరానికి జ్యోతిలక్ష్మి గురించి తెలీదు. అయినా సినిమాకు దానికి చాలా తేడా వుంటుంది. చార్మి అద్భుతంగా చేస్తుందనే నమ్మకముంది అని ముగించారు.