గురువారం, 21 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:15 IST)

పవన్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించానుః ప్రకాష్ రాజ్

మీరు లేకపోతే సినిమా లేదు అనేది అబద్ధం

chiru, prakashraj
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన లెటెస్ట్ తెలుగు ఫిల్మ్ "వకీల్ సాబ్". 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. ఈ పాత్ర గురించి, తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ పెర్‌ఫార్మెన్స్‌కు ముగ్థుడై ఆయ‌న్ను అభినందించారు. అనంత‌రం ప్ర‌కాష్ రాజ్ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ఇలా ఆవిష్క‌రించారు.
 
- ఒక సినిమాలో నటుడు బాగా నటించాడూ అంటే కథ, సంభాషణలు, సందర్భాలు ఇవన్నీ కుదరాలి. అన్నీ బాగున్నప్పుడు అందులో మా నటన ఎలివేట్ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు లేకపోతే సినిమా లేదు అనేది అబద్ధం. అలా ఎవరైనా అంటే అది వాళ్ల ప్రేమ అనుకుంటాను. వకీల్ సాబ్ సెట్ కు వస్తే నిజంగా కోర్టుకు వచ్చినట్లే అనిపించేది.  ఒక రోజు నేను 9 గంటలకు సెట్ కు వస్తే, పవన్ గారు ఉదయం ఏడున్నర గంటలకే వచ్చారు. పవన్ గారిని అడిగితే నాకు నిద్రపట్టలేదు వచ్చేశాను అన్నారు. యూనిట్ అంతా చర్చించుకునే వాళ్లం సీన్సు గురించి.
 
- ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు గత చిత్రాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నేను పవన్ గారు కలిసి నటించిన బద్రి సినిమాలో నందా పాత్ర అలా వారికి బాగా గుర్తుండిపోయింది. వకీల్ సాబ్ లో నా పాత్రకు నందగోపాల్ అని పెట్టగానే ప్రేక్షకులు బద్రి టైమ్ కు వెళ్లిపోయి కనెక్ట్ అయ్యారు. కావాలనే దర్శకుడు నా క్యారెక్టర్ కు నందా అని పెట్టారు. కథ చెప్పడం కాదు ప్రేక్షకులకు వినోదాన్ని కూడా అందించాలి. నందాజీ, నంద గోపాల్ అని పవన్ గారు నన్ను పిలిచినప్పుడు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు అందుకే ఆ పేరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సంతోషంగా ఉంది.
 
- థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఆడియెన్ ఆ సినిమాను తాను ఎంజాయ్ చేశాడా లేదా అనేదే ఆలోచిస్తాడు. ఎంత సందేశాత్మక కథ చూపించినా, ఎంటర్ టైన్ మెంట్ ఇంపార్టెంట్. అందుకే కోర్ట్ రూమ్ డ్రామాను కూడా ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించారు.
 
- పవన్ గారి ఆలోచనలకు చాలా దగ్గరైన కథ ఇది. ఆయనకు చాలా రిలవెంట్ సబ్జెక్ట్. ఆయన కొన్ని సంభాషణలు చెబుతున్నప్పుడు అవి మనసులో నుంచే వచ్చాయి అనిపిస్తుంది. మహిళల గురించి సినిమా చేసినా మనకు సాంగ్స్, ఫైట్స్ కావాలి. పవన్ గారి ఇమేజ్ కు అనుగుణంగా సినిమా చేస్తూనే...అవన్నీ చేర్చారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.
 
- భాష ఒకటే, భావం ఒకటే ఉండొచ్చు. పింక్ లో అమితాబ్ బచ్చన్ నటించినప్పుడు దాని మీదున్న అంచనాలు వేరు, అజిత్ గారు తమిళంలో చేసినప్పుడు ఆయన ఇమేజ్ కు తగినట్లు చేశారు. అలాగే ఇక్కడ పవన్ గారు మూడేళ్ల తర్వాత సినిమా చేస్తున్నారంటే, ఆయన ఇమేజ్ కు తగిన సినిమా చేయాలి. పవన్ గారి ఆలోచనా విధానానికి తగిన కథే ఇది. 
 
- నేను నటుడిని, నాకు సినిమాలు తీయడం తెలియదు. అందుకే సంతృప్తి కోసం నచ్చిన కథలను ఏవో చిన్న బడ్జెట్ లో సినిమాలు నిర్మిస్తుంటాను. కానీ వకీల్ సాబ్ అంత పెద్ద సినిమాలను నేను నిర్మించలేను.
 
- పవన్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో  రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ గారు మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ గారితో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు. పవన్ గారు ఒక లీడర్. ఆయన్ను ప్రేమిస్తాను కాబట్టే పవన్ గారు అలా ఉండాలి అని కోరుకుంటాను.
 
Prakash raj
- సెట్ లో నాకు పవన్ గారికి మధ్య మంచి చర్చలు సాగేవి. ప్రొటెస్ట్ పొయెట్రీ కర్ణాటకలో ఎలా ఉంటుంది నాకు పుస్తకాలు కావాలి అని ఆయన నన్ను అడిగారు. అలాగే నా దోసిట చినుకులు పుస్తకాలు చదివి పవన్ గారు మీ ఐడియాలజీ బాగుంది అన్నారు. మా మధ్య ఇలాంటి చర్చలు సెట్స్ లో చాలా జరిగాయి.
 
- పవన్ గారికి నాకు సమాజం పట్ల, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళల గురించి ఇంకా సినిమాలు రావాలి. పురుషుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు అబ్బాయిల్ని పెంచేప్పుడే సన్మార్గంలో పెట్టాలి. మహిళల్ని గౌరవించడం నేర్పాలి. 
 
- నేను ఈ సినిమాలో అమ్మాయిల్ని బాధ పెడుతూ ప్రశ్నించాను. ఆర్ యూ వర్జిన్ అని అడిగినప్పుడు బాధగా అనిపించింది. అయితే నేను నటుడిని, నా క్యారెక్టర్ ప్రకారం నటించాను. కానీ లోపల బాధగానే అనిపించింది. ఈ చిత్రంలో నివేదా, అంజలి, అనన్య ముగ్గురూ చాలా సహజంగా నటించారు.
 
- పవన్ గారు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోయారు. రాజకీయం మనం అనుకునే దాని కంటే సంక్లిష్టమైనది. ఓడిపోయినా ప్రజల కోసం పవన్ గారు నిలబడ్డారు. అదీ గొప్ప రాజకీయ నాయకుడి లక్షణం. పవన్ గారిలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.  
 
- సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఐదు భాషల్లో నటిస్తున్నాను. తమిళ, కన్నడ, హిందీతో చూస్తే తెలుగులో కొంత సినిమాలు తగ్గినట్లు అనిపించవచ్చు. కేజీఎఫ్, యువరత్న, మేజర్, వకీల్ సాబ్, తమిళంలో సూర్యతో నటిస్తున్నా.ఇలా చాలా బిజీగానే ఉన్నాను. నేను అందరికీ కావాల్సిన నటుడిని కదా. ఎవర్నీ వదులుకోలేను.