శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 17 డిశెంబరు 2016 (21:34 IST)

తెలుగువారే బెటర్‌.. అబ్బో తమిళవాళ్ళా!... రావు రమేష్‌ ఇంటర్వ్యూ

తెలుగు నటుడు రావు గోపాలరావు తనయుడు రావు రమేష్‌. చాలాకాలం మదరాసులోనే వుంటూ.. టీవీ సీరియల్స్‌లో నటించిన ఆయన తమిళ చిత్రాల్లో నటించలేకపోయాడు. తెలుగులో వెతుక్కుంటూ అవకాశాలు రావడంతో.. ఇక్కడే పెద్ద పేరు సంపాదించుకున్నాడు. అగ్ర హీరోలతో కలిసి నటించిన ఆయన చిన్

తెలుగు నటుడు రావు గోపాలరావు తనయుడు రావు రమేష్‌. చాలాకాలం మదరాసులోనే వుంటూ.. టీవీ సీరియల్స్‌లో నటించిన ఆయన తమిళ చిత్రాల్లో నటించలేకపోయాడు. తెలుగులో వెతుక్కుంటూ అవకాశాలు రావడంతో.. ఇక్కడే పెద్ద పేరు సంపాదించుకున్నాడు. అగ్ర హీరోలతో కలిసి నటించిన ఆయన చిన్న హీరోలతనూ నటించాడు. ఇప్పుడు 'నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌' అనే చిత్రంలో హీరోయిన్‌ తండ్రిగా నటించాడు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆయన ఆయనతో జరిపిన చిట్‌చాట్‌.
 
ఇందులో మీ పాత్రకు రెలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
ప్రతి ఒక్క తండ్రి తమని తాము చూసుకున్నామని ఫోన్‌ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషానిచ్చింది. ముఖ్యంగా ఒక రచయిత ఫోన్‌ చేసి సర్‌ ఇక మీకు బంగారు పెన్నుతో వెండి పేపర్ల మీద డైలాగులు రాయాలి అన్నారు. ఆ మాట నాకో పెద్ద గౌరవంలా అనిపించింది.
 
మీ జీవితంలో తండ్రిగా ఎలా వుంటారు?
ఇంకెలాగు. సినిమాలో చూపించినట్లే. కొడుకుతో కన్నా కూతురితోనే తండ్రికి ఎక్కువ రిలేషన్‌ ఉంటుంది. నాక్కూడా మా అమ్మాయితో ఎక్కువ రిలేషన్‌. మా అమ్మాయిని అమ్మ అనే పిలుస్తాను. ఏది అడిగినా సరే అంటాను.
 
ఈ పాత్ర ఎలా వచ్చింది ?
'సినిమా చూపిస్తా మామ' సినిమాకు ముందే ఈ కథ నాకు వినిపించారు. ఈ పాత్ర గురించి చెబుతూ డైరెక్టర్‌ ఇంకో 5 ఏళ్ల వరకు ఇలాంటి పాత్ర ఇండస్ట్రీలో పుట్టదని అన్నాడు. అప్పుడు ఏమో! అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అది నిజమే అనిపిస్తోంది.
 
పాత్రలో వేరియేషన్స్‌ ఎలా చూపిస్తారు?
చాలా కష్టం ఉంటుంది. ఒక పాత్ర చేసినప్పుడు కాసేపు అదే మోడ్‌లో ఉండిపోతాం. కానీ సెట్లో ఆ టైమ్‌కి డైరెక్టర్‌ చెప్పేది కరెక్టుగా క్యాచ్‌ చేసి ఆ మోడ్‌లోకి వెళ్లగలిగితే డైరెక్టర్‌ అనుకున్న ఔట్‌పుట్‌ ఇవ్వచ్చు. ఒక్కోసారి సీరియస్‌గా చేస్తూనే.. వెంటనే సౌమ్యంగా మారాలి. దాన్ని అవపోసనపట్టాలి.
 
ఓ తరహా పాత్ర ఇష్టపడతారు?
నెగెటివ్‌ రోల్స్‌ అంటే కాస్త ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వాటిలో నటించడానికి ఎక్కువ అవకాశముంటుంది.
 
అలాంటి పాత్రలు చేసేటప్పుడు మీ నాన్నగారు రావుగోపాల్‌ రావుగారి ప్రభావం మీ మీద ఉంటుందా?
నాన్న లక్షణాలు, మూమెంట్స్‌ కొన్ని నాలో స్వతహాగానే ఉంటాయి. కానీ నేను కావాలని ఆయన్ని ఇమిటేట్‌ చేయను. ఒకవేళ అది సరిగా రాకపోతే ఎవరూ చూడరు. పైగా అవన్నీ ఎందుకని విమర్శలు కూడా వస్తాయి.
 
మదరాసులో వుండి అక్కడ ఎందుకు నటించలేకపోయారు?
వేరే భాషా సినిమాలు రెండు వచ్చాయి. కానీ వేరే భాషల్లో సినిమాలు చేయడానికి నేను ఇష్టపడను. మనం తమిళంలోకి వెళితే ఏదో వాళ్ళ డబ్బంతా మనం తింటున్నట్టు చూస్తారు. కేవలం ఒక్క తెలుగువాళ్ళు మాత్రమే అందరినీ ఆదరిస్తారు. వేరే భాషలు వాళ్ళు అలా చేయరు.
 
కొత్త చిత్రాలు?
అల్లు అర్జున్‌ డీజే, ఇంకో రెండు సినిమాల్లో నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నాను. మూడు మంచి సినిమాలు మంచి పాత్రలే. తప్పకుండా సక్సెస్‌ అవుతాయి.
 
డ్రీమ్‌ రోల్స్‌ ఉన్నాయా?
ఫలనా పాత్ర చేయాలని లేదు. ప్రస్తుతం చాలా పాత్రలు నాకోసమే రాస్తున్నారు. వాటిని నేను మాత్రమే చేయగలిగేలా రాస్తున్నారు. ఆ పాత్రలనే చేసుకుంటూ వెళ్లిపోతుంటాను. అంతకంటే డ్రీమ్‌రోల్స్‌ లేవు అని చెప్పారు.