సోమవారం, 26 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2015 (21:30 IST)

మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది: రాశీఖన్నా

నేటితరం అమ్మాయిలంటే.. కుటుంబంలో ఏదైనా సమస్యలుంటే పంచుకునేట్లుగా వుండాలని నటి రాశీఖన్నా తెలియజేస్తుంది. 'జిల్‌' సినిమా తర్వాత.. 'బెంగాల్‌ టైగర్‌'లో నటించింది. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బెంగాల్‌ టైగర్‌ సినిమా విశేషాలతో పాటు తన కెరీర్‌ ప్లానింగ్స్‌ గురించి రాశి ఖన్నా తెలియజేసింది.
 
ఈమధ్య బాగా సన్నబడ్డారు. ఏదైనా ప్రత్యేక కారణమా?
సన్నబడ్డం మంచిదే కదా! లుక్‌ విషయంలో చిన్న మార్పు కోరుకున్నా. అందుకోసమే సన్నబడ్డా. అదేవిధంగా కాస్ట్యూమ్స్‌ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నా. అదలా ఉంచితే సినిమా సినిమాకూ కొత్తగా కనిపిస్తేనే మనం ఎదుగుతున్నట్టు!
 
బెంగాల్‌టైగర్‌లో అవకాశం ఎలా వచ్చింది?
గోపీచంద్‌తో నేను నటించిన 'జిల్‌' సినిమా చూసిన దర్శకుడు సంపత్‌ నంది, తను తీయబోయే బెంగాల్‌ టైగర్‌ కోసం నన్ను సంప్రదించారు. ఆ సమయంలోనే ఆయన చెప్పిన కథతో పాటు నా రోల్‌ కూడా బాగా నచ్చి వెంటనే ఓకే చేసేశా.
 
'జిల్‌' తరహాలో అమ్మాయిగా వుంటుందా?
కానే కాదు. ఈ సినిమాలో నేను శ్రద్ధా అనే ఈతరం అమ్మాయిగా కనిపిస్తా. తండ్రితో అన్ని విషయాలను షేర్‌ చేసుకోగల అమ్మాయికి, ఆ తండ్రికి మధ్యన ఉండే ఎమోషన్‌ చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాలో రావు రమేష్‌ నా తండ్రిగా నటించారు. మా ఇద్దరి కాంబినేషన్‌లోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.
 
రవితేజ చిత్రంలో పనిచేయడం ఎలా అనిపించింది?
నా కెరీర్‌కిది చాలా పెద్ద సినిమా. రవితేజ, తమన్నాలతో కలిసి నటించడం మరచిపోలేను. మంచి ఎంటర్‌టైనింగ్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఇక రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్‌ను అందుకోవడం చాలా కష్టం. ఆయన ఆన్‌‌స్క్రీన్‌ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉంటారు. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత రవితేజకు మరింత పెద్ద ఫ్యాన్‌ అయిపోయా. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.
 
రెండో హీరోయిన్‌గా నటించడం పట్ల ఎలా ఫీలయ్యారు?
సినిమా ఒప్పుకున్నపుడే నా పాత్రకున్న ప్రాధాన్యం ఎంతో తెలుసు. అంతేకాకుండా తమన్నా నుంచి కూడా చాలా నేర్చుకున్నా. నన్ను తన సొంత సోదరిలా చూసుకుంటూ డ్యాన్స్‌, మేకప్‌ విషయంలో జాగ్రత్తలు చెప్పేది.
 
గత చిత్రాలు చూస్తే గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారే?
గ్లామర్‌ పాత్రలనే ఎక్కువగా ఎంచుకోవడంలో తప్పేమీ లేదనుకుంటా. నా మటుకు గ్లామర్‌, డీ గ్లామర్‌ ఇలా రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్ళడమే అజెండాగా పెట్టుకున్నా. ఇంకా చెప్పాలంటే.. నేను డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించిన 'ఊహలు గుసగుసలాడే' గ్లామర్‌ పాత్రల కన్నా ఎక్కువ క్రేజ్‌ తెచ్చిపెట్టింది.
 
ఇంతకుముందు చేసిన 'శివమ్‌' నిరాశపర్చిందికదా.. ఎలా ఫీలయ్యారు?
నన్నడిగితే ఫెయిల్యూర్స్‌ కూడా మనకు చాలా నేర్పిస్తాయనే నమ్ముతా. ఆ ఫెయిల్యూర్‌ నుంచి పాఠాలు నేర్చుకొని ఏవైనా తప్పులు చేసి ఉంటే మళ్ళీ అలా చేయకుండా వెళ్ళిపోవడమే మన పని.
 
బాలీవుడ్‌లో అవకాశాలు వున్నాయా?
లేవు. నేనిప్పుడు పూర్తిగా హైద్రాబాద్‌కు మారిపోయా. ప్రస్తుతం నా దృష్టంతా తెలుగు సినిమాలపైనే! ఇప్పటికిప్పుడు బాలీవుడ్‌కు వెళ్ళిపోవాలన్న ఆలోచన లేదు.
 
సాయిధరమ్‌ తేజ్‌తో చేస్తోన్న 'సుప్రీమ్‌' విశేషాలు?
సుప్రీమ్‌ సినిమా విషయంలో నేను చాలా ఎగ్జైటింగ్‌ ఉన్నా. ఇందులో ఓ పోలీస్‌గా కనిపిస్తా. ఆ పాత్రలో మంచి ఫన్‌ ఉంది. సినిమా కూడా చాలా బాగా వస్తోంది అని చెప్పారు.