అవసరాల శ్రీనివాస్, నానిలు 'అష్టాచెమ్మ'తో ఆర్టిస్టులుగా పరిచయమయ్యారు. తర్వాత నాని హీరోగా ఎదిగాడు. శ్రీనివాస్.. నటుడిగా... రచయితగా... నిలదొక్కుకుంటున్నాడు. శ్రీనివాస్ నటుడిగా సరైన పాత్రలేదని జెంటిల్‌మెన్.. సినిమా సమయంలో నాని చెప్పాడు. అందుకే శ్రీనివాస్.. అవసరం ఉన్నప్పుడు.. రచయితగా, దర్శకుడిగా మారుతున్నాడు. 'ఊహలు గుసగులసాడే' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ చిత్రాన్ని నిర్మించిన వారాహి బేనర్‌పై 'జ్యో అచ్యుతానంద'కు దర్శకత్వం వహించాడు. ఈనెల 9న రిలీజ్ అవుతుంది. దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో
ఇంటర్వ్యూ విశేషాలు...
* ఇది ముక్కోణపు ప్రేమకథా?
సోషల్ మీడియాలో ఇలాగే రాశారు. కానీ కాదు. 'జ్యో' అంటే రెజీనా నారా రోహిత్, నాగశౌర్య ఉండే ఇంటిపై అద్దెకుంటుంది. ఇద్దరూ అన్నదమ్ములు. వారిమధ్య వచ్చే ఘర్షణలు.. సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం.
* దర్శకుడుగా గ్యాప్ తీసుకున్నారే?
కథలు నేనే రాసుకుంటాను. దాదాపు 4 నెలలు పడుతుంది. మధ్యమధ్యలో ఆర్టిస్టుగా చేస్తుంటాను. జంటిల్‌మెన్, కంచె.. నటుడిగా చేశాను. పైగా కంచె షూటింగ్‌లో ఉండగానే చేయి విరిగింది. అప్పుడు 5 నెలలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
* కథలో ఫ్లాష్‌బ్యాక్‌లున్నాయే?
కథ 2010లో జరుగుతుంది. అది మొదటిభాగం.. 2016 సెకండాఫ్.
* మల్టీస్టారర్‌తో చేయడానికి కారణం?
మొదట ఈ కథను ముగ్గురుకు చెప్పాను. సోలో హీరో అయితే చేస్తామన్నారు. అప్పుడు నారా రోహిత్‌కు చెప్పాను. ఓకే అన్నాను. సోదరుడిగా ఎవరని అడిగితే నాగశౌర్య అన్నాను. దానికి అంగీకరించారు. ఈ పాత్రను శౌర్య అని.. నేను రాసేటప్పుడు ఫిక్స్ అయ్యాను. పైగా.. పెద్ద స్టార్‌లు చేసే సినిమాకాదు. అప్‌కమింగ్ హీరోలైతే.. ఈ కథకు సూటవుతుందని అనుకున్నా.
* అన్నదమ్ముల కథలు చాలా వచ్చాయే?
అవును. వచ్చాయి. సినిమా చూశాక.. వాటికి వీటికి పోలిక అడిగితే చెప్పగలను.
* ఇందులో నటించారా?
ఒక్క సీన్‌లో నటించాను కానీ.. ఎడిటింగ్‌లో తీసేశారు.
* నాని కూడా నటించాడు కదా ఎలాంటి పాత్ర?
ఓ పాత్ర చేశాడు. సినిమా చూశాక.. మీరే చెప్పాలి ఎలా వుందో.
* కమర్షియల్ ఎలిమెంట్లు ఉన్నాయా?
అదేమిటనేది నాకు ఐడియాలేదు. ఏదైనా కథను ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్లేది నా దృష్టిలో కమర్షియల్.. అంతేకానీ.. మాస్ సాంగ్ పెట్టి.. అదే కమర్షియల్ అనుకోవడం కరెక్ట్‌కాదు.
* రచయితగా ఎవరి ప్రభావం వుంది?
చిన్నపుడు వీసీఆర్, వీసీపీలు అద్దెకు తీసుకుని.. జంధ్యాల, రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసేవాడిని.. ఇప్పటికీ స్క్రిప్ట్ రాస్తే వారే గుర్తుకొస్తారు. తర్వాత సాహిత్యం చదివాను. ముళ్ళపూడి వెంకటరమణ ప్రభావం వుంది.
* పబ్లిసిటీలో హీరోహీరోయిన్ల కాస్టూమ్స్, గెటప్‌లు కొత్తగా ఉన్నాయే?
నాకు వాటిపై పెద్దగా అవగాహనలేదు. కథ, దర్శకత్వమే తెలుసు. నాగశౌర్యకు కథ చెప్పాక... ఈ గెటప్‌లో వుంటానని అన్నాడు. ఓకే అన్నాను. దర్శకుడిగా నటీనటుల పెర్‌ఫార్మెన్స్ గురించే చూస్తాను. ఇంకేమీ పట్టించుకోను.
* దర్శకుడిగా అన్నీ తెలిసుండాలి కదా.. ఏమీ తెలియకపోతే భయంలేదా?
ఏ భయమూ లేదు. నా పనిపై నాకు నమ్మకముంది. అన్ని పట్టించుకుంటే.. దర్శకత్వం పక్కదారిపోతుంది.
* మీలో టూమచ్ కాన్‌ఫిడెన్స్ కన్పిస్తుందో?
టూమచ్ కాదుకానీ.. దానికంటే.. ఎక్కువ ఆనందాన్నిచ్చింది. నేను రాసుకుంది తీయగలననే గట్టి నమ్మకం అంతే.. 'ఊహలు గుసగుసలాడే' సింపుల్ లవ్‌స్టోరీ.. ఒక బాస్.. పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మరొకరిని ప్రేమిస్తుంది. అందుకే.. జ్యో అచ్యుతానంద.. కొత్తగా చూపించాలని రాశాను. ఆ ఫార్మెట్ వున్నా.. కథ వేరుగా వుంటుంది.
* మీకోసం పాత్ర రాసుకోలేదా?
ప్రతి సినిమా చేసేస్తే.. వీడు దర్శకత్వం చేస్తే.. పాత్ర కూడా చేస్తాడు.. అనే నెగెటివ్ టాక్ వస్తుంది. అందుకే రాసుకోను.
* తదుపరి చిత్రాలు...
వారాహి చలనచిత్రంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే జెంటిల్‌మన్ తర్వాత నానిలో ఓ కొత్త యాక్టర్ బయటకు వచ్చాడు. కాబట్టి ఆ సినిమా కంటే బావుండేలా నేను నానితో సినిమా చేయాలనుకుంటున్నాను. అల్రెడి లైన్ చెప్పాను. చర్చలు జరుగుతున్నాయి.
* నటుడిగా బోల్డ్ క్యారెక్టర్ 'హంటర్'లో చేస్తున్నారే?
బాలీవుడ్ మూవీ హంటర్‌కు రీమేక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాను. నెల బ్రేక్ తీసుకుని నటిస్తా. ఆ క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా వుంటుంది. సెక్స్‌పాయింట్‌పై నడుస్తుంది. అందులో కంటెంట్ బాగా నచ్చింది. చాలామంది ఎందుకు చేస్తున్నావ్? అన్నారు. కానీ నాకు అందులో సెకండాఫ్‌లో ఏడుపువచ్చింది. అంత ఎమోషన్ వుంది. యాజ్‌టీజ్‌గా కథ వుండదు. కాస్త మారుతుంది.
* ఊహలు.. సినిమాలో డైలాగ్స్ బేస్డ్‌పై నడిపించారు. ఇందులో కూడానా?
కొన్ని కథలు అలా వుంటాయి. నటుడు గోవిందకు రాయాలంటే. టకటక.. స్పీడుగా మాటలు మాట్లాడేట్లు రాయాల్సివుంటుంది. అలాగే కథను బట్టి పాత్రలను బట్టి అందులో మాటలుంటాయి.. కానీ జ్యో అచ్యుతానంద్‌లో.. అంతలా మాటలుండవు. కథ వుంటుంది.