ఎన్‌టిఆర్ కథానాయకుడిగా నటించిన సినిమా 'నాన్నకు ప్రేమతో'. రకుల్ ప్రీత్‌సింగ్ నాయిక. సుకుమార్ దర్శకుడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈనెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.
* కొత్తగెటప్ వేస్తున్నప్పుడు రిసీవ్ చేసుకుంటారో లేదో అనే భయం ఏర్పడలేదా?
నిజానికి చాలా భయపడ్డాను. జట్టు, గెడ్డం డిజైన్ చేయడానికి ఫిబ్రవరి నుంచి జులై వరకు పట్టింది. మధ్యలో జుట్టులోని లేయర్స్ ఒక్కోటి జాగ్రత్తగా కట్‌చేసి.. షేప్ చేసేవారు. అసలు ఈ కథకు ఇలాగే ఉండాలని ఎందుకు అనుకుటున్నారనేది.. సామాన్యుడిగా నేను సుకుమార్‌ను అడిగాను. యు.కె. నేపథ్యంతో కూడిన కథ. వరల్డ్ వైడ్‌లో స్టైలిష్ లుక్ అంటే ఇలా వుండాలని.. చాలా పరిశీలించి ఈ గెటప్ తెచ్చారు. ఓ దశలో చాలా భయమేసింది. ఇటువంటి గెటప్ తెలుగులో రిసీవ్ చేసుకుంటారా లేదా? అని.. మా అమ్మకు ఈ గెటప్ ఏమిటి? అని అడిగింది. ఆమెకు అర్థంకాలేదు. నాన్న అర్థం చేసుకున్నారు.
* సుకుమార్ మీతో తీయాలకున్న కథ ఇదికాదని వార్తలు వచ్చాయి?
అవును మొదట వేరే కథ అనుకున్నారు. కానీ సుకుమార్ ఫాదర్ నిమ్స్‌లో చికిత్స చేసుకుంటూ చనిపోయాక.. ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు.. తండ్రితో ఉన్న సాన్నిహిత్యంతో.. ఆయన మైండ్‌లో పుట్టిన కథ.. ఆయన ఫాదర్ చనిపోయాక.. కార్యక్రమాలు అయ్యాక.. ఆయన ఫోన్ చేసి.. నేను వేరే కథ అనుకున్నాను. అంటూ కథ చెప్పారు. కథ చెప్పాక.. చాలా ఎట్రాక్ట్ అయ్యాను. నేను తండ్రినయ్యాను.. నాకూ తండ్రి వున్నాడు.. తండ్రి కోరిక తీర్చడం కోసం కొడుకు పడే తపన. ఇందులో కళ్ళకు కన్పిస్తుంది. ఏ కొడుకైన కనెక్ట్ అవుతాడు. అందుకే ఈ సినిమా చేసేద్దాం అని చెప్పాను.
* మీలో మార్పు కన్పిస్తుంది?
మనిషిగా మారాను. అవును. నేను చాలా హైపర్. నా తండ్రి నా గురించి ఎంత తపనపడేవారు నాకు కొడుకు పుట్టాక అర్థమైంది. కొడుకు ప్రేమే నన్ను మార్చేసింది.
* ఆడియో వేడుకలో ఏడ్చేశారు.. ఎందుకని?
ఆడియో వేడుకలోనా కాదు.. షూటింగ్‌లో కూడా ఏడ్చేశాను. క్లైమాక్స్ సీన్ చేసేటప్పుడు రాజేంద్రప్రసాద్‌ను పట్టుకుని ఏడ్చేశాను. ఆ సీన్ చేస్తుండగా నాన్నగారు గుర్తుకువచ్చారు. వెంటనే నాన్నతో మాట్లాడాలనిపించింది. నాకంటే ముందుగా రాజేంద్రప్రసాద్.. నాన్నగారికి ఫోన్‌లో మొత్తం చెప్పేశారు. అప్పుడు నాన్నగారి పుట్టినరోజు. ఇది సినిమా.. అలాగే ఉంటుంది. అలాగే ఇన్‌వాల్వ్ అయి చేయి.. అంటూ ఎంకరేజ్ చేశారు. అలాగే ఆడియోవేడుకలో కూడా.. ఒక పక్క దేవీశ్రీప్రసాద్ తండ్రిగారు.. అంతకుముందే చనిపోవడం, కెమెరామెన్ తండ్రి కూడా. అలాగే మరోపక్క నా ముందు నాన్నగారు ఉండటం. ఇవన్నీ ఒక్కసారిగా నన్ను ఆవహించాయి. నటన అంటే ఇన్‌వాల్వ్ అయి చేయడమే. అలా అయితేనే నేను చేసినట్లుంది.
* మరి రొమాన్స్ విషయంలోనూ అలా చేస్తారా?
అలాంటి చేసేటప్పుడు బెరుకుగా ఉంటుంది. అన్‌ఈజీగా ఫీలవుతాను.
* మరి అలా చేస్తే హీరోయిన్లు ఇబ్బంది పడలేదా?
లేదు.. మీరే అడిగి చూడండి...
* ఇందులో రెండు పాత్రలు పోషించారా?
లేదు. ఒకే పాత్ర. ఒక్కసారి అంటే. కొద్దిసేపు అలా కన్పిస్తాను.
* గాసిప్స్ ఎలా ఫీలవుతారు?
ఒకప్పుడు బాగా ఫీలయ్యేవాడిని. కానీ ప్రస్తుతం సరదాగా తీసుకుంటున్నా.
* మీరు మాస్ ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకుని చేస్తారా?
నాకు మాస్, క్లాస్ అనే తేడాలేదు. నిజానికి ఎమోషన్స్ అంతా ఒక్కటే.. ఆనందాన్ని, ఎమోషన్స్‌కు బయటకు వ్యక్తంచేసేది మాస్ అంటారు. కానీ క్లాస్ వారు కూడా చేస్తారు. కానీ లోపలో అణగదొక్కుకుంటారు.
* తాతగారిలా పౌరాణికాలు చేయాలనే ఆలోచనవుందా?
ఏదైనా చేస్తాను. అలాంటి దర్శకులు, కథలు రావాలి. నన్ను మెప్పించే కథలు వస్తే.. 'శంకరాభరణం', 'సాగర సంగమమం' లాంటివి చేస్తాను. అయితే తాతగారు లెజెండ్. ఆయనతో నన్ను పోల్చకండి. ఆయనకు ఆయనే సాటి. నేను ఆయన ముందు చిన్నవాడిని.
* సంక్రాంతికి నందమూరి ఫ్యాన్స్ మధ్య పోటీ అని ప్రచారం జరుగుతుందే?
అలాంటిది ఏమీలేదు. ఒకప్పుడు పండుగగకు నాలుగైదు సినిమాలు ఆడేవి. నేడు తగ్గిపోయాయి. మన తెలుగు పరిశ్రమకు సంక్రాంతి, వేసవి. దీపావళి.. వంటివి ఉన్నాయి అందరు సినిమాలు ఆడాలి. బాబాయ్ సినిమా బాగా ఆడాలి. అలాగే నాగార్జున సినిమా ఆడాలి.
* రాజమౌళితో సినిమా చేస్తున్నారా?
'బాహుబలి' అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది ఆయనే. ఆయనే చెబితే బాగుటుంది. నేను స్టూడెంట్ నెంబర్ 1 ఆయనతో చేశాను.
* కొరటాల శివ సినిమా ఎప్పుడు?
ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. 'జనతా గ్యారేజ్' అనే టైటిల్ ఆలోచనలో ఉన్నారు. అని ముగించారు.