పరాజయాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమే.. వారి కారణంగానే ఓడిపోయాం.. కెప్టెన్‌ స్మిత్‌

చేజేతులా ఫైనల్ మ్యాచ్‌ను బలమైన ముంబై జట్టుకు సమర్పించుకుని తలవంచాక రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతున్న ప్రతి మాట నిర్వేదానికి మారుపేరుగా నిలుస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముంబై ఇండియన

steve smith
హైదరాబాద్| Raju| Last Modified సోమవారం, 22 మే 2017 (10:27 IST)
చేజేతులా ఫైనల్ మ్యాచ్‌ను బలమైన ముంబై జట్టుకు సమర్పించుకుని తలవంచాక రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతున్న ప్రతి మాట నిర్వేదానికి మారుపేరుగా నిలుస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ 10 ఫైనల్ మ్యాచ్‌లో చివరివరకు క్రీజ్‌లో ఉండి 51 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్నిందించలేకపోయిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మ్యాచ్‌ అనంతరం ఒకింత నిర్వేదంగా మాట్లాడాడు. ఈ పరాజయాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమని చెప్పాడు. అయితే, టోర్నమెంటు మొత్తం తమ ఆటగాళ్లు చక్కని ఆటతీరు ప్రదర్శించడం గర్వంగా ఉందని చెప్పాడు. 129 పరుగులు భారీ లక్ష్యమేమీ కాదని, కానీ ఈ వికెట్‌ మీద పరుగులు రాబట్టడం కష్టంగా మారిందని, అందువల్లే గెలుపునకు దూరమయ్యామని చెప్పాడు.

విజయాన్ని తృటిలో చేజార్చుకున్న బాధ తనను వెంటాడుతున్నప్పటికీ, తమ ఓటమికి ముంబై బౌలర్లే ప్రధాన కారణమని స్మిత్‌ అంగీకరించాడు. కీలకమైన దశలో పరుగులు చేయకుండా తమ బ్యాట్స్‌మెన్‌ను ముంబై బౌలర్లు నిలువరించారని, అదే మ్యాచ్‌ గతిని మార్చేసిందని చెప్పాడు. ‘మా చేతిలో వికెట్లు ఉన్నాయి. ఒకటి, రెండు మంచి ఓవర్లు పడితే చాలు మ్యాచ్‌ మా చేతిలోకి వచ్చేది. కానీ, వాళ్లు (బౌలర్లు) అద్భుతంగా ఆడి.. మమ్మల్ని నిలువరించారు’ అని అన్నాడు. ఐపీఎల్‌లో ఆడటం చాలా అద్భుతంగా ఉందని, గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని స్మిత్‌ చెప్పాడు.

ఆదివారం నాటి ఫైనల్‌ మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ జట్టును చివరివరకు విజయం ఊరించింది. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు చేస్తే ఆ జట్టు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వరించేది. చేతిలో ఎనిమిది వికెట్లు సైతం ఉన్నాయి. ఈ దశలో పుణె విజయం ఖాయమని అంతా భావించారు. కానీ, చివరివరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణె జట్టు ఆశలు అడియాసలయ్యాయి.
దీనిపై మరింత చదవండి :