ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (10:04 IST)

నేటి నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం - కనీస విలువ రూ.4.3 లక్షల కోట్లు

5g spectrum
ప్రస్తుతం దేశంలో 4జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పోల్చితే పది రెట్లు వేగంగా సేవలు పొందగిలే 5జీ స్పెక్ట్రమ్ వేలం పాట మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 9 బ్రాండ్లలో మొత్తంగా 72 గిగా హెర్ట్జ్ 5జీ తరంగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస విలువ రూ.4.3 లక్షల కోట్లుగా ఉంది. 
 
ఈ తరంగాలని దక్కించుకునే సంస్థ 20 యేళ్ల పాటు వినియోగించుకోవచ్చు. పదేళ్ల తర్వాత సరెండర్ కూడా చేయొచ్చు. అయితే, ఈ తరంగాల కోసం బిడ్డింగ్‌లో పాల్గొనే కంపెనీలు ముందస్తు చెల్లింపులు చేయనక్కర్లేదు. 20 సమ వాయిదాల్లో చెల్లింపులు జరుపుకోవచ్చు. 
 
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌పై ఎక్కువగా దృష్టిసారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బ్యాండ్‌లో అత్యధిక స్పెక్ట్రమ్‌ను కలిగివుండటమే ఇందుకు ప్రధాన కారణం. టెలికాం విఫణిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా మార్కెట్ వాటా పెంచుకునే దిశగా జియో అడుగులు వేస్తుంది. 
 
మరోవైపు, భారతీ ఎయిర్‌టెల్, ఐడియా వొడాఫోన్ కంపెనీలు 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో అధిక స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం 3 సంస్థలు గట్టిగా పోటీపడుతూ బిడ్లు దాఖలు చేసే అవాశం ఉంది.  
 
తాజా వేలంలో రూ.1, రూ.1.1 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలు కొనుగోలు చేసే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్పెక్ట్రమ్ విక్రయానంతరం ఆగస్టులో 5జీ సేవలకు దేశంలో శ్రీకారం చుట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 
 
జూలై 26వ తేదీన జరిగే వేలం పాటల్లో టెలికాం సంస్థలైన రియలన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ఐడియాతో ఆదానీ గ్రూపునకు చెందిన ఆదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. దీంతో ఈ వేలం పాటలపై ఆసక్తి నెలకొంది. తమ సొంత అవసరాల కోసం (క్యాప్టివ్) నెట్‌వర్క్ కోసం స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు టెక్ సంస్థలకు అనుమతివ్వడం ఈ సారి వేలంలో ప్రత్యేకంగా అంశం. 
 
ఈ వేలం పాటలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో టెలికాం కంపెనీలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. ఈ బిడ్లు దాఖలు చేసిన తర్వాత రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.