1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (12:02 IST)

మొబైల్ చార్జీలు భారీగా పెంచాల్సిందే : ఎయిర్ టెల్ సీఈవో

airtel
దేశంలోని ప్రైవేట్ టెలికా కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌ టెల్ ఎండీ గోపాల్ విట్టల్ మొబైల్ వినియోగదారులకు పిడుగులాంటి వార్త వినిపించారు. మొబైల్ చార్జీలను భారీగా పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. సమీప భవిష్యత్‌లో మొబైల్ చార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. 
 
ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) సుమారు రూ.200గా ఉందని, నిజానికి ఇది దాదాపు రూ.300 ఉండాలని ఆయన పేర్కొన్నారు. రూ.300లకు పెంచినప్పటికీ ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఏఆర్పీయూగా ఉంటుందని విట్టల్ అభిప్రాయపడ్డారు.
 
ఆర్థిక సంవత్సరం-2024 నాలుగో త్రైమాసికానికి ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.209కు చేరిందని, 2023 నాలుగో త్రైమాసికంలో ఇది రూ.193గా ఉందంటూ ఆయన పోల్చారు. టెలికాం రంగంలో టారిఫ్ రేట్లలో ప్రధాన సవరణ చేయాల్సిన అవసరం ఉందని విట్టల్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాల్లో ఏఆరీయూలో పెరుగుదల ఉందని, అయితే మరిన్ని పెంపులు అవసరమని అన్నారు. ఎయిర్టెల్ నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.