బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. గడువు ముగిసినా వ్యాలిడిటీ పెంపు...
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోం సేవలు జోరుగా సాగుతున్నాయి. వీరికి అనువుగా ఉండేందుకు వర్క్ ఫ్రమ్ హోం పేరిట ల్యాండ్ లైన్ వినియోగదారుల కోసం బ్రాండ్ బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇపుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తాజాగా లాక్‌డౌన్ సమయంలో మొబైల్ సబ్‌స్కైబర్స్‌కు వెసులుబాటు కలిగించేలా ఒక ప్రకటన చేసింది. ఉచితంగా వ్యాలిడిటీని పొడగించడంతోపాటు, టాక్‌టైమ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ సమయంలో రీచార్జ్ చేసుకోవడం కుదరని వారికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
మార్చి నెల 20వ తేదీ తర్వాత వ్యాలిడిటీ ముగిసిన మొబైల్ వినియోగదారులకు ఏప్రిల్ 20 వరకు ఉచితంగా వ్యాలిడిటీని పొడిగించనున్నట్టు ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్ కాలంలో వినియోగదారుల బ్యాలెన్స్ జీరోకు చేరితే.. వారికి 10 రూపాయల ఉచిత టాక్‌టైమ్ అందించనున్నట్టు తెలిపింది. 'ఈ కష్ట సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు మద్దతుగా నిలుస్తుంది. వినియోగదారు రీచార్జ్ చేసుకోవడానికి డిజిటల్ పద్దతులు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు మై బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యాప్, బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ వాలెట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి' అని ఆ కంపెనీ ఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.