బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (19:10 IST)

ఫ్యూచర్‌ గ్రూపుతో వివాదం... అమెజాన్‌కు ఎదురుదెబ్బ..

అమెజాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్‌ గ్రూపుతో వివాదం నేపధ్యంలో ఈ సందర్భం చోటుచేసుకుంది. కిశోర్ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్ గ్రూప్, ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ డీల్‌కు అమెజాన్ అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ... సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) తాజాగా ఆమోద ముద్ర వేయడం విశేషం.. అయితే అమెజాన్ అభ్యంతరాలపై వివరణ కోరింది.
 
అంతేకాకుండా... కీలక ఒప్పందాల సమయంలో ఎలాంటి వివాదమున్నప్పటికీ... ముందుగా తనతో పాటు,షేర్ హోల్డర్స్‌కు కూడా సమాచారమందించాలని సెబీ తెలిపింది. దాంతోపాటు ఎన్‌సీఎల్‌టీ దృష్టికి తీసుకురావాలని కూడా స్పష్టం చేసింది.
 
అలాగే ఈ ఒప్పందంలో భాగంగా యాజమాన్యం మార్పునకు సంబంధించి న్యాయపరంగా చిక్కులు తలెత్తకుండా రూట్ మ్యాప్ సమాచారాన్ని కూడా అందించాలని సెబీ ఆదేశించింది. కిందటి సంవత్సరం ఆగస్టు 29న... రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ వాటాలను రూ. 24,713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్‌కు గతేడాది నవంబరులోనే సీసీఐ అంగీకారం లభించగా, తాజాగా సెబీ కూడా ఆమోద్రముద్ర వేసింది.
 
కాగా,ఈ ఒప్పందంపై అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సింగపూర్‌ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. ఫ్యూచర్‌లోని కూపన్ విభాగంలో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉన్న నేపథ్యంలో... తమకు సమాచారమివ్వకుండానే ఎలా విక్రయిస్తారు? అని ప్రశ్నించింది. నష్టపరిహారమివ్వాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే... నిబంధనల ప్రకారమే ఈ డీల్‌ ఉందని, అమెజాన్‌కు పరిహారం చెల్లించే ప్రశ్నేలేదని ఫ్యూచర్‌ గ్రూపు తెగేసి చెప్పింది.