దేశంలోని మొబైల్ వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు సెప్టెంబరు ఐదో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే దేశ టెలికాం రంగంలో మొబైల్ సేవలతో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా మరో రికార్డు నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఇపుడు బ్రాడ్ బ్యాండ్ సేవల్లోనూ ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు జియో ఫైబర్ ముందుకు వచ్చింది. ఇందుకోసం ఆరు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లలో కనిష్టంగా రూ.699గాను గరిష్టంగా రూ.8499గా నిర్ణయించింది. అయితే, ప్రతి ప్లాన్‌కు నెలవారీ, వార్షిక ప్లాన్ అంటూ వెసులుబాటు కల్పించారు.
ఈ ఆరు ప్రీపెయడ్ ప్లాన్లలో తొలుత బ్రాంజ్ కేటగిరిలో నెలకు రూ.699కు, సిల్వర్ విభాగంలో నెలకు రూ.849కు, గోల్డ్‌లో రూ.1299కు, డైమండ్ విభాగంలో నెలకు రూ.2499కు, ప్లాటినంలో రూ.3999కు, టైటానియం విభాగంలో నెలకు రూ.8499 చొప్పను ధరను నిర్ణయించింది.
ఇందులో బ్రాంజ్, సిల్వర్ ప్లాన్లలో కస్టమర్లకు సెకనుకు 100 ఎంబీపీఎస్ గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అలాగే గోల్డ్, డైమండ్‌లలో 250, 500 ఎంబీపీఎస్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అయితే వీటితోపాటు 3, 6, 12 నెలల వాలిడిటీ ఉన్న ప్లాన్లను కూడా జియో గిగాఫైబర్‌లో అందిస్తున్నారు.
* బ్రాంజ్ ప్లాన్‌లో నెలకు రూ.699, యేడాదికి రూ.3,388 చెల్లిస్తే అందుబాటులోకి వస్తుంది. దీంట్లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 150 జీబీ డేటా ఇస్తారు. వార్షిక ప్లాన్ తీసుకున్నవారికి ఓ బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా ఇవ్వనున్నారు.
* సిల్వర్ ప్లాన్‌లో నెలవారీ అయితే రూ.849, ఏడాది మొత్తానికి రూ.10,188 చెల్లించాలి. దీంట్లోనూ యాన్యువల్ ప్లాన్‌కు బ్లూటూత్ స్పీకర్ ఫ్రీగా ఇస్తారు. డేటా విషయానికొస్తే, 100 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 400 జీబీ డేటా అందిస్తారు.
* గోల్డ్ ప్లాన్‌లో నెలకు 750 జీబీ డేటా లభిస్తుంది. నెట్ వేగం 250 ఎంబీపీఎస్. నెలవారీ అయితే రూ.1299, రెండేళ్ల మొత్తానికి అయితే రూ.31,176 చెల్లించాలి. రెండేళ్ల మొత్తానికి ఈ ప్లాన్ తీసుకుంటే 24 అంగుళాల హెచ్ డీ టీవీ ఉచితం.
* డైమండ్ ప్లాన్‌లో నెలకు రూ.2,499, ఏడాది ప్లాన్ కు రూ.29,988గా నిర్ణయించారు. ఇందులో యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 24 అంగుళాల హెచ్‌డీ టీవీ ఉచితంగా లభిస్తుంది. దీంట్లో నెట్ స్పీడ్ 500 ఎంబీపీఎస్. నెలకు 1500 జీబీ డేటా ఇస్తారు.
* ప్లాటినం ప్లాన్‌లో నెలకు రూ.3,999, ఏడాది మొత్తానికి అయితే రూ.47,988 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 1 జీబీపీఎస్ స్పీడ్ తో నెలకు 2500 జీబీ డేటా లభ్యమవుతుంది. ఇందులో వార్షిక ప్లాన్ వినియోగదారులకు 32 అంగుళాల హెచ్ డీ టెలివిజన్ ఫ్రీ.
* టైటానియం ప్లాన్‌లో నెలవారీ చెల్లింపు అయితే రూ.8,499, వార్షిక ప్లాన్ అయితే రూ.1,01,988గా ధరలు నిర్ణయించారు. ఇందులో నెట్ స్పీడ్ 1జీబీపీఎస్ కాగా, 5000 జీబీ డేటా అందిస్తారు. దీంట్లో యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 43 అంగుళాల అత్యాధునిక 4కే టీవీ ఉచితం. ఇది పూర్తిగా హైఎండ్ ప్లాన్.
ఇక ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఇచ్చే డేటా అంతా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. 30 రోజులు కాగానే బిల్ సైకిల్ మారి, స్పీడ్, డేటాలు యథావిధిగా లభిస్తాయి. జియో గిగాఫైబర్ ప్లాన్లలో ఇండియాలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు.
అలాగే అన్ని ప్లాన్లలోనూ ఏడాదికి రూ.1200 విలువ గల ఉచిత టీవీ వీడియో కాలింగ్‌ను, మరో రూ.1200 విలువైన గేమింగ్ సదుపాయాన్ని, హోం నెట్‌వర్కింగ్, డివైస్ సెక్యూరిటీ (5 డివైస్‌లకు) సదుపాయాలను అందిస్తున్నారు. ఇక డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో అదనంగా వీఆర్ ఎక్స్‌పీరియెన్స్, ప్రీమియం కంటెంట్ (ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీలు, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్)ను అందిస్తున్నారు.
అదేవిధంగా జియో గిగాఫైబర్ సేవలకు గాను వార్షిక ప్లాన్‌ను ఒకేసారి తీసుకునే వారికి వెల్కం ఆఫర్ కింద రూ.5 వేల విలువైన జియో హోం గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కె సెట్ టాప్ బాక్స్‌లను ఉచితంగా అందిస్తారు. దీంతోపాటు 3 నెలల పాటు జియో సినిమా, జియో సావన్ యాప్‌లకు, ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.