గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (11:53 IST)

సస్పెన్స్‌కు తెరదించిన మైక్రోసాఫ్ట్... టిక్‌టాక్‌పై ఆ లోపు తుది నిర్ణయం

చైనాకు చెందిన ప్రముఖ వీడియో మెసేజింగ్ యాప్ టిక్ టాక్ ఇపుడు చేతులు మారనుంది. ఈ అంశంపై ఇప్పటివరకు నెలకొన్న సస్పెన్స్‌కు ఇపుడు తెరపడింది. టిక్ టాక్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఓ మైక్రో బ్లాగ్ పోస్ట్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 
 
కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబరు 15వ తేదీనాటికి పూర్తి చేస్తామని తెలిపింది. టిక్ టాక్‌ను కొనుగోలు చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సవివరంగా ప్రకటనను విడుదల చేసింది.
 
'అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరాలను అర్థం చేసుకున్నామని... సమాచార భద్రతకు ముప్పు రాకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికాకు ఆర్థిక లాభం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. 
 
అమెరికా పౌరుల డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలతో పంచుకోబోమని స్పష్టం చేసింది. అమెరికా సమాచారం పొరపాటున ఇత దేశాల్లోని సర్వర్లలోకి వెళ్లి ఉంటే... వాటిని శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 
 
ఇక టిక్‌టాక్‌తో ఒప్పందం కుదిరితే అమెరికాతో పాటూ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్ దేశాల్లోని కార్యకలాపాలన్నీ మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఈ డీల్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇతర అమెరికా మదుపర్లుకు కూడా అవకాశం కల్పిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.