బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (16:44 IST)

ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్‌.. గూగుల్ ఏం చేసిందంటే?

యూట్యూబర్లు, టిక్‌టాక్‌ యూజర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా.. గత కొద్ది రోజుల నుంచి టిక్‌టాక్‌కు యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో కేవలం 1 స్టార్‌ మాత్రమే రేటింగ్‌ ఇచ్చి ఆ యాప్‌ను పెద్ద ఎత్తున తమ తమ ఫోన్ల నుంచి తొలగించారు. దీంతో టిక్‌టాక్‌ రేటింగ్స్‌ దారుణంగా పడిపోయాయి. 
 
ఓ దశలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఆ యాప్‌కు 1.2 రేటింగ్‌ వచ్చింది. అయితే దీనిపై గూగుల్‌ స్పందించింది. అలాంటి 80 లక్షల రేటింగ్స్‌ను గూగుల్‌ ఒకేసారి ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. దీంతో టిక్‌టాక్‌ రేటింగ్‌ ప్రస్తుతం ప్లే స్టోర్‌లో మళ్లీ 4.4కు చేరుకుంది. అయినా భారత దేశంలో మాత్రం ఇంకా బ్యాన్‌ టిక్‌టాక్‌ అనే ఉద్యమం కొనసాగుతోంది. మనదేశంలో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
 
ప్రపంచదేశాల్ని శవాల దిబ్బలుగా మార్చేస్తున్న కరోనా చైనాలో పుట్టడం, అదే దేశానికి చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌లో హింసను ప్రేరేపించేలా వీడియోలు ఉండడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మనదేశంలో టిక్ టాక్‌కు పోటీగా డిజైన్ చేసిన మిత్రోన్ యాప్‌ను వినియోగిస్తున్నారు. మిత్రోన్ యాప్‌ను ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించాడు. కేవలం నెల రోజుల్లో ఈ యాప్ డిజైన్ చేయడం, డిజైన్ చేసిన తక్కువ సమయంలోనే 50లక్షలకు పైగా యూజర్స్ సొంతం చేసుకోవడంతో ఇండియాలో టిక్ టాక్‌కు కాలం చెల్లినట్లేనని నెటిజన్లు కామెంట్  చేస్తున్నారు. మరి టిక్ టాక్ భారత్‌లో నిషేధానికి గురవుతుందా లేదా అనేది వేచి చూడాలి.