గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (08:34 IST)

పండుగ వేళ రూ.1000 కోట్ల ఫోన్లు అమ్మిన మొబైల్ కంపెనీ ఏది?

samsung  m13
దేశ వ్యాప్తంగా పండగ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌ను అనుకూలంగా మలచుకునేందుకు అనేక వ్యాపార కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ కంపెనీలు వివిధ ఆఫర్లతో తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు పోటీ పడుతున్నాయి. 
 
తాజాగా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ ఆదివారం ఒక్క రోజే ఏకంగా ఈకామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఏకంగా రూ.1000 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్లను విక్రయించింది. పండగ విక్రయాలలో భాగంగా పలు రాయితీలు ప్రకటించిన శాంసంగ్ అమ్మకాల్లో పోటీ సంస్థలను వెనక్కి నెట్టేసింది. శాంసంగ్ ఫోన్ల అమ్మకాల్లో అమెజాన్ సంస్థ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తమ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ రెండింతలు పెరిగినట్టు శాంసంగ్ తెలిపింది. 
 
ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్20, ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎం53, గెలాక్సీ ఎం33, గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ ఎం13 మోడళ్లు ఉండగా, గెలాక్సీ ఎం13 బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మిడ్ రేంజ్ లభిస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్ కావడం గమనార్హం. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు, ముందు వైపు 8 ఎంపీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 14 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. 
 
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. 4జీ ర్యామ్/64 జీబీ అంతర్గత మెమరీ ఒక మోడల్ కాగా, దీని ధర రూ.9,499గా ఉంది. 6జీబీ/128 జీబీ మెమరా వేరియంట్ ధర రూ.11,499గా ఉంది. ఈ వేరియంట్‌లోనే 5జీ ఫోన్ 4జీబీ/64 జీబీ వేరింయట్ ధర రూ.11,499కాగా, 6జీబీ/128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.13999గా ఉంది.