వాట్సాప్ సేవలు డౌన్... పండగ చేసుకున్న టెలిగ్రామ్
ఇటీవల వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏడు గంటల తర్వాత ఈ సేవలను పునరుద్ధరించారు. ఈ సేవల అంతరాయానికి కారణం మాత్రం ఫేస్‌బుక్ యాజమాన్యం ఇప్పటివరకు వెల్లడించలేదు.
అయితే, వాట్సాప్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో లేకపోవడంతో స్వదేశీ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్ పండగ చేసుకుంది. ఒకటీ రెండూ కాదు.. ఏడు గంటల్లో ఏకంగా 7 కోట్ల మంది కొత్త యూజర్లను టెలిగ్రామ్ సంపాదించడం విశేషం.
సాంకేతిక లోపం కారణంగా గంటల పాటు వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల మంది యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో చాలా మంది టెలిగ్రామ్, సిగ్నల్ సేవలను వాడటం ప్రారంభించారు.
ఈ వాట్సాప్ అవుటేజ్ సమయంలో తమకు కొత్తగా 7 కోట్ల మంది యూజర్లు వచ్చినట్లు టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెప్పారు. ఇంత సడెన్‌గా అంత మంది యూజర్లు వచ్చినా ఇబ్బంది కలగకుండా చూసుకున్న తన టీమ్‌ను కూడా ఆయన అభినందించారు.
ఒకేసారి కోట్ల మంది యూజర్లు టెలిగ్రామ్‌కు సైనప్ చేయడంతో తమ సేవలు కాస్త నెమ్మదించినట్లు కూడా పావెల్ తెలిపారు. టెలిగ్రామ్‌కు ఇప్పటివరకూ 100 కోట్లకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. అందులో 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు వివరించారు. టెలిగ్రామ్ ఒక్కటే కాదు వాట్సాప్ అవుటేజ్ సమయంలో సిగ్నల్ కూడా బాగానే లాభపడింది.