బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 26 జూన్ 2018 (14:01 IST)

పిల్లలకు డబ్బు ఇస్తున్నారా? ఆ డబ్బుతో వాళ్లేం చేస్తున్నారు?

పిల్లలకు ప్రేమ పంచడం, మంచి చదువు చెప్పించడం, క్రమశిక్షణ నేర్పించడం ఎంత అవసరమో... డబ్బు పట్ల అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. మీ చిన్నతనంలో మీకున్న ఆర్థిక పరిస్థితి, దాన్నుంచి మీరేం నేర్చుకున్నారు. మీ పిల్లలకు మీరేం చెప్పాలనుకుంటున్నారో, దాని గురించ

పిల్లలకు ప్రేమ పంచడం, మంచి చదువు చెప్పించడం, క్రమశిక్షణ నేర్పించడం ఎంత అవసరమో... డబ్బు పట్ల అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. మీ చిన్నతనంలో మీకున్న ఆర్థిక పరిస్థితి, దాన్నుంచి మీరేం నేర్చుకున్నారు. మీ పిల్లలకు మీరేం చెప్పాలనుకుంటున్నారో, దాని గురించి ముందు తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి. పిల్లలకు డబ్బు గురించి, దాని అవసరం, దానిని ఎలా ఉపయోగించాలో తెలియజేయడం వలన వారికి నైతిక విలువలు గురించి తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
పిల్లలకు చేసే పనిపట్ల గౌరవం ఉండేలా చూసుకోండి. ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదని, కష్టపడితేనే దక్కుతుందని తెలిసేలా చేయండి. పిల్లలకు డబ్బు గురించి తెలిసి వాళ్ళంతట వాళ్ళు లెక్కలు తెలుసుకునే వరకు మీరే అన్ని కొనివ్వండి తప్ప వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వద్దు. డబ్బు విలువ తెలిసిన తరువాతే వాళ్ళకు డబ్బివ్వండి. ఇచ్చేముందు దాన్ని వాళ్ళెలా ఖర్చు చేయాలనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి. అలాగని పదేపదే చెబుతూ వాళ్ళపై ఒత్తిడి తేవడం సరికాదు. వాళ్ళంతట వాళ్ళే దాచుకునేలా ప్రోత్సహించాలి. దానివల్ల కలిగే లాభాలు వివరించాలి. మీరు డబ్బు ఖర్చుపెట్టే విధానం బట్టే పిల్లలూ ఖర్చుపెడతారు. 
 
మీరేం చెప్తున్నారు అనేదానికన్నా మీరేం చేస్తున్నారు అనేది వాళ్ళల్లో నాటుకుపోతుంది. మీరు బాధ్యతగా డబ్బును ఖర్చు పెట్టినపుడే వాళ్ళు కూడా అంతే బాధ్యతగా ఉంటారని గుర్తించుకోండి. పిల్లలు వాళ్ళ ఇష్టమొచ్చిన వస్తువులు కొనేసి మిమ్మల్ని డబ్బు కట్టమని చెప్తుంటే మాత్రం నో అని ఖచ్చితంగా చెప్పండి. మీరు అలా కాకుండా వెంటనే డబ్బు సర్దితే వాళ్ళకు డబ్బువిలువ తెలియదు. ఆ వస్తువు మనకెంత వరకు అవసరమో వివరించి చెప్పండి. పిల్లలుకు కొంత డబ్బు ఇచ్చి దానిని ఇన్నిరోజులు వాడుకోవాలి అని ఖచ్చితంగా చెప్పాలి. వారు ఆడబ్బును ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తున్నారో గమనించండి. 
 
ఆ డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టారనిపిస్తే తగిన సూచనలు ఇవ్వండి. మీరు ఇచ్చిన దాంట్లో వారు కొంత పొదుపు చేయగలిగితే ఖచ్చితంగా చిన్న కానుక ఇవ్వండి. దానివల్ల వారికి పొదుపు చేయాలనే కోరిక వస్తుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు తమ ఆర్థిక పరిస్థితి తెలిస్తే సరిగ్గా చదవలేరు అనే అపోహతో వారు అడగగానే అప్పు తెచ్చి మరీ ఇస్తారు. దాని వలన పిల్లలు విలాసాలకు అలవాటుపడి, డబ్బును దుబారాగా వాడతారు. దీని వలన పిల్లలు, తల్లిదండ్రులూ ఇద్దరు జీవన విధానాన్ని సరిగా సాగించలేరు.