పిల్లల భద్రతపై రాజీ పడేది లేదు.. మెటా గ్రీన్ సిగ్నల్
పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలను తగిన చట్ట అమలు సంస్థలకు నివేదించడానికి మెటా అంగీకరించిందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. భారతదేశంలో పనిచేస్తున్న ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కైనా పిల్లల ఆన్‌లైన్ భద్రత ఒక ప్రాథమిక సూత్రం అని, దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడలేమని మెటా స్పష్టం చేసింది.
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతను నిర్ధారించడానికి చురుకైన చర్యలు తీసుకోని ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, హానికరమైన కంటెంట్, కార్యకలాపాల నుండి మైనర్లను రక్షించాల్సిన ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. అటువంటి కంటెంట్‌ను ముందుగానే గుర్తించి తొలగించేలా చూసేందుకు ప్రభుత్వం ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో కూడా సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనల గురించి చట్ట అమలు సంస్థలకు సమాచారం అందించేందుకు మెటా అంగీకరించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పిల్లలకు ఈ ప్లాట్‌ఫారమ్‌లను సురక్షితంగా మార్చే దిశగా ఇది ఒక మొదటి అడుగు మాత్రమేనని, ఇంకా చాలా చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.
హానికరమైన కంటెంట్‌ను అరికట్టేందుకు భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అటువంటి సమాచారాన్ని అన్ని ప్లాట్‌ఫారమ్‌లు ముందుగానే గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆ వర్గాలు వెల్లడించాయి.
బాలల లైంగిక వేధింపుల సామగ్రి, డీప్‌ఫేక్‌లతో సహా హానికరమైన, చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్‌పై ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘాను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

