శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 ప్రముఖ నియోజకవర్గం
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (14:41 IST)

కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి తీరుతాం : తేల్చిచెప్పిన రైతులు

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవితను ఓడించి తీరుతామని స్థానిక రైతులు ప్రతిజ్ఞ చేశారు. అందువల్ల ఎన్నికల బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని వారంతా తేల్చి చెప్పారు. 
 
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కవిత పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఆమెపై 180 మందికిపైగా రైతులు పోటీ చేయడమే ఇందుకు కారణం. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కవిత ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు ఆమెపై బరిలోకి దిగారు. 
 
దీంతో ఓట్లు చీలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ వారితో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని ప్రయత్నించింది. సమస్యలు పరిష్కరిస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే, రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గేది లేదని, బరిలోనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. 
 
నామినేషన్ల ఉపసంహరణ గడువు 28వ తేదీ శుక్రవారంతో పూర్తికానుండగా ఒక్క రైతు కూడా ముందుకు రాకపోవడంతో తెరాస నేతలను కలవరపరుస్తోంది. ఈ స్థానం నుంచి మొత్తం 203 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా, మిగతా వారంతా రైతులే కావడం గమనార్హం.