మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 ప్రముఖ నియోజకవర్గం
Written By మోహన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (14:06 IST)

టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ ఆఫీస్ నుండి 300 కూర్చీలు ఎత్తుకెళ్లారు..

ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్‌లను దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. పార్టీలోని అధిష్టానాలకు విధేయులుగా ఉంటూ ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అలాంటి నాయకులకు చివరి నిమిషంలో టికెట్ రాకపోతే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. 
 
కానీ ఇది కాస్త భిన్నంగా జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని సిల్లాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ ఔరంగాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు. కానీ ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిరాకరించింది. సత్తార్‌ స్థానంలో ఎమ్మెల్సీ సుభాష్‌ జాంబాద్‌కు ఔరంగాబాద్‌ ఎంపీ టికెట్‌ను కేటాయించారు. దీంతో నిరాశ చెందిన సత్తార్ తన అనుచరులతో పాటు పార్టీ ఆఫీస్‌లో ఉన్న 300 కుర్చీలను తన ఇంటికి తీసుకెళ్లాడు.
 
ఈ సందర్భంగా సత్తార్ మీడియాతో మాట్లాడుతూ..పార్టీ ఆఫీసులో ఉన్న కుర్చీలు తన సొంత డబ్బులతో కొనుగోలు చేసానని, ఈ కుర్చీలను కాంగ్రెస్ సమావేశాల కోసం ఉపయోగించారని, తాను ఇప్పుడు పార్టీ నుండి వైదొలుగుతున్నానని, కనుక తన కుర్చీలను తీసుకెళ్తున్నాని చెప్పాడు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో వాళ్లు కుర్చీలను, ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని సత్తార్‌ సూచించారు.