లోక్‌సభ ఎన్నికల్లో "చిరుత" హీరోయిన్ పోటీ!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో సినీ తారలు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇలాంటి వారిలో రామ్ చరణ్ నటించిన చిరుతలో హీరోయిన్ నేహా శర్మ ఒకరు. బీహార్ రాష్ట్రంలోని భగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా, ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు మా పార్టీకి వస్తే మాత్రం మా కుమార్తె నేహా శర్మను పోటీకి దించుతాని భగల్‌పూర్ ఎమ్మెల్యే అజిత్ శర్మ తెలిపారు. అయితే, తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానానిదే అని చెప్పారు.
కాగా, బీహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాగా 'ఇండియా' కూటమి చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఇక హీరో రామ్‌చరణ్ నటించిన 'చిరుత' సినిమాతో వెండితెరకు పరిచయమైన నేహా శర్మ ఆ తర్వాత 'కుర్రాడు' చిత్రంలో ఆడిపాడింది. అనంతరం టాలీవుడ్‌కు దూరమైన ఆమె పలు హిందీ, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించింది.
మరోవైపు ఈసారి పార్లమెంట్ ఎన్నికల కోసం పలు రాజకీయ పార్టీలు సినీ నటులతో పాటు క్రీడాకారులనూ బరిలోకి దింపుతున్నాయి. ఇందులో భాగంగా బంగాల్లోని అధికార టీఎంసీ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు టికెట్ ఇచ్చింది. బహ్‌రమ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్రంలో విరుదునగర్ స్థానం నుంచి సినీ నటి రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.