మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు... తొలుత పోస్టల్ బ్యాలెట్ల నుంచి ప్రారంభం..
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైవున్న ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
అన్ని కౌంటింగ్ కేంద్రాలలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఆదివారం ఎన్నికల సంఘంను కలిశారు.
ఈ క్రమంలో, రూల్ 54ఏ ప్రకారం అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదట ప్రారంభమవుతుందని ఈసీ తెలిపింది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి 1961లోని రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారని వెల్లడించింది. కౌంటింగ్‌కు ఫారమ్ 17సీతో పాటు ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లు ఉండాలి.
543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ట్రెండింగ్, ఫలితాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో చూడవచ్చు. వోటర్ హెల్ప్ లైన్ యాప్ నూ అందుబాటులో ఉంటాయని ఈసీ తెలిపింది. ఇదిలావుంటే, మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే విపక్షాలు ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇండియా కూటమి గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.