ఎన్నికల వేళ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపాలిపామ్ గ్రామం.. ఎందుకో తెలుసా?
దేశ వ్యాప్తంగా సార్వత్రిక సంబరం ప్రారంభమైంది. ఈ లోక్‌సభ ఎన్నికల వేళ అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లా నేపాలిపామ్ గ్రామం ఇపుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ గ్రామంలో దాదాపు 300 మంది కుటుంబాలు ఉండగా, వారంతా ఒకే పరంపరకు చెందిన వారు కావడం గమనార్హం. వీరంతా రాన్ బహదూర్ థపా వారసులు. రాన్ బహదూర్ థపా ఒక గూర్ఖా. ఆయన సోనిత్పూర్ నదీ తీరానికి వచ్చి స్థిరపడ్డారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించారు. ఈయనకు ఐదుగురు భార్యలు. 12 మంది కుమారులు. 10 మంది కుమార్తెలు.
ఈ క్రమంలో రాన్ బహదూర్ థాపా 1997లో చనిపోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబం క్రమంగా విస్తరించి, కుటుంబ సభ్యుల సంఖ్య 2500కి పెరిగింది. అందులో 1200 మంది ఓటర్లు ఉండడం విశేషం. నేపాలిపామ్ గ్రామం తేజ్పూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. వీరి కుటుంబం పెరిగిన కొద్దీ... క్రమంగా ఇతర కుటుంబాలుగా విడిపోయాయి. కానీ అదే ప్రాంతంలో ఉండిపోయాయి. ఈ గ్రామమే నేపాలి ఫామ్.
తన తండ్రి ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారని... ఆయనకు తాము మొత్తం 22 మంది పిల్లలం ఉన్నామని రాన్ బహదూర్ థాఫా పెద్ద కొడుకు చెప్పారు. అయితే తమ కుటుంబం పెరిగినా కొద్దీ ఎవరికి వారు కుటుంబాలుగా విడిపోయామని చెప్పారు. మా కొడుకులు, మనవళ్లు, కూతుళ్లు, మనవరాళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారని, వారికీ పిల్లలు ఉన్నారని తెలిపారు. తమ గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయన్నారు. మా గ్రామంలో తన తండ్రి వారసత్వమే ఉందని, ఇతరులు ఎవరూ లేరన్నారు.