తమిళనాడులో వాడిపోయిన రెండాకులు

aiadmk
Last Updated: గురువారం, 23 మే 2019 (12:36 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేకు పూర్తి నిరాశ కలిగించాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ సీట్లకుగాను 38 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 35 సీట్లలో డీఎంకే అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే కూటమి కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే వివాదాల సుడిగుండంలో చిక్కుకుని ముక్కలు చెక్కలై తిరిగి ఒక్కటైంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో అన్నడీఎంకే చతికిలపడింది. ఈ ఎన్నికలో ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.

మరోవైపు, ప్రతిపక్ష డీఎంకే మాత్రం విజయవిహారం చేసింది. ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం.. డీఎంకే 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అన్నాడీఎంకే కేవలం మూడు స్థానాల్లో మాత్రం పడుతూ లేస్తూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే డీఎంకే తమిళనాడులో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. పోటీ చేసిన అన్ని చోట్లా గట్టి పోటీ ఇస్తోంది. తాజా ఫలితాలతో అన్నాడీఎంకే శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. పార్టీ కార్యాలయాలు బోసి పోయాయి.

ఇకపోతే, 22 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ తప్పలేదు. 22 అసెంబ్లీ సీట్లలో అన్నాడీఎంకే 11, డీఎంకే 11 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీటీవీ దినకరన్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు ఒక్కరు కూడా విజయం సాధించేలా లేదు. అలాగే, సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది.దీనిపై మరింత చదవండి :