మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 22 మే 2019 (16:00 IST)

గర్భరక్షాంబికా ఆలయం గురించి మీకు తెలుసా?

సర్వాంతర్యామి అయిన దేవుడు అనేక క్షేత్రాలలో వెలసి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఒక్కో క్షేత్రానికి ఒక్కొక్క విశిష్ట గుర్తింపు ఉంటుంది. భక్తులు వాటిని సందర్శించి దేవున్ని దర్శించుకుని తమ కష్టాలు పోగొట్టుకుంటారు. అలాగే సంతానం లేని వారికి, ఆరోగ్యమైన మంచి శిశువు కోరుకునే వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది గర్భరక్షాంబికా ఆలయం. 
 
ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఈ గర్భరక్షాంబికా దేవాలయం ఉంది. తంజావూరు-కుంబకోణం వెళ్ళే మార్గంలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ తిరుక్కరుగావుర్‌గా పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు సుమారు 7అడుగుల ఎత్తులో ఉండి కంచిపట్టు చీర ధరించి సర్వాలంకార భూషితయై మెరిసిపోతుంటుంది. 
 
ఇక్కడకి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికి అమ్మని నమ్మి వస్తారు. ఎవరైనా తెలిసి కానీ, తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇక్కడ కొలువై ముల్లైవనాథర్‌గా ఉన్న మల్లికార్జునుడు స్వయంభువుగా వెలిసిన స్వామి. శంకరుడు స్వయంభువుగా వెలిసిన అరవైనాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ శివలింగం పుట్ట మన్నుతో చేసినది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు. కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. 
 
అలాగే ఈ క్షేత్రానికి మాధవీ క్షేత్రం అని కూడా పేరు. మాధవీ అంటే సంస్కృతములో మల్లెలు అని అర్థం. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగయే. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు శివలింగము మీద చంద్ర కిరణాలు నేరుగా పడతాయి. ఈ క్షేత్ర విశిష్టతను పరిశీలిస్తే, పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు ఎప్పూడు శివుడిని పూజిస్తూ విహిత కర్మాచారణ చేస్తూ ఆనందంగా కాలం గడిపేవారు. 
 
అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలుగకపోవడం. సంతానం కోసం వీరిద్దరు పార్వతీపరమేశ్వరులను విశేషంగా ఆరాధించారు. ఒక మంచి రోజు వేదిక గర్భం దాల్చింది. ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికంలో ఉంది. ఆ సమయంలో ఊర్థ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికి ఇంటిపనితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు. 
 
దాంతో ఆగ్రహించిన ఊర్థ్వ పాదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలవుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్థిస్తుంది. అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడు జన్మిస్తాడు. 
 
అతనికి నైధ్రువన్ అని పేరు పెడుతారు. అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీర్చుతుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలుగజేయమని ప్రార్థిస్తారు. మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక, ముల్లైవనాథర్‌గా కొలువై ఉన్నారు. 
 
ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగ ప్రసవం అయ్యి, మంచి పిల్లలు పుడతారు. పెళ్లికాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు అవుతారు. ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవ్వరికీ సంతానం లేకపోవడం లేదా గర్భస్రావాలు వంటి సమస్యలు లేవు. ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు, ఇతర రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.