బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (20:08 IST)

ఢిల్లీ కారాగారాల్లో కరోనా విలయతాండవం... జైళ్ళలో ఖైదీల బంబేలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఢిల్లీలోని జనావాస ప్రాంతాలతో పాటు.. జైళ్ళలో కూడా ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో హస్తినలో గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనమే తీహార్ జైలులో 16 మందికి ఖైదీలకు 21 మంది సిబ్బందికి, మండోలి జైలులో ఐదుగురు ఖైదీలకు ఇద్దరు సిబ్బంది, రోహిణి జైలులో ఐదుగురు సిబ్బంది కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. దీంతో ఢిల్లీ జైళ్ళ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ సోకిన ఖైదీలతో పాటు.. సిబ్బందిని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయికి చేరింది. ఈ నెలాఖరు నాటికి దేశ వ్యాప్తంగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 నుంచి 8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో కరోనా థర్డ్ వేమ్ మార్చి నాటికి ముగిసిపోతుందని ఆయన అంచనా వేశారు. 
 
లక్ష దాటేసిన పాజిటివ్ కేసులు 
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కల్లోలం సృష్టిస్తుంది. ఫలితంగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా లక్షకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనప్పటి నుంచి భారీగానే కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా, రెండు మూడు రోజులుగా కొత్త కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,17,100గా నమోదయ్యాయి. ఈ వైరస్ సోకడం వల్ల మరో 302 మంది మృత్యువాతపడ్డారు. ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 36,256 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుని ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 3,71,363కు పెరిగాయి. అదేవిధంగా ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు మొత్తం నమోదైన ఒమిక్రాన్ కేసులు కలుపుకుంటే 2630కు చేరింది.