గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (09:21 IST)

దేశంలో థర్డ్‌వేవ్ ప్రారంభమైందా? పుదుచ్చేరిలో 19 చిన్నారులకు కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు.. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, థర్డ్ వేవ్ రూపంలో ఈ ముప్పు పొంచివుందని హెచ్చరిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో 19 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. బాధిత చిన్నారులను కదిర్‌గామంలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. 
 
వీరిలో 13 మంది ఏడాది వయస్సులోపు వారు కాగా, రెండేళ్లలోపున్న వారు ఇద్దరు, ఐదేళ్లలోపున్న వారు నలుగురు ఉన్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోనూ కొందరు చిన్నారులు ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ వ్యాప్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక చేసింది. ఈ ముప్పు ఇంకా తొలగిపోలేదని అందువల్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. 
 
వరుసగా తొమ్మిదివారాలపాటు తగ్గుతూ వచ్చిన కొవిడ్‌ మరణాల సంఖ్యలో మళ్లీ పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం మరణాల సంఖ్య 3 శాతం అధికంగా నమోదైంది. 
 
కిందటివారం ప్రపంచవ్యాప్తంగా 55 వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే 30 లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల సంఖ్య 10 శాతం పెరగడం గమనార్హం. ముఖ్యంగా.. బ్రెజిల్‌, భారత్‌, ఇండోనేషియా, బ్రిటన్‌ దేశాల్లో కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.